పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు పెద్ద రిలీఫ్ వచ్చింది. వారం రోజుల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత జనగాం టిక్కెట్ దక్కించుకున్నారు. సుదీర్ఘ కాలం మంత్రిగా… పీసీసీ అధ్యక్షునిగా చక్రం తిప్పినా.. చివరికి… ఈ ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఆయన నానా తంటాలు పడాల్సి వచ్చింది. నియోజకవర్గంలో పోటీ దారులెవరూ లేకపోయినా… ఆ సీటును.. పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు ఇవ్వాలని మొదటగా నిర్ణయించడంతో.. ఆయనకు మొదటి రెండు జాబితాల్లో.. చోటు దక్కలేదు. వెంటనే ఢిల్లీ వెళ్లి ఏఐసిసి స్థాయిలో ప్రయత్నాలు చేశారు. బీసీ సెంటిమెంట్‌ను.. ఉపయోగించడంతో వర్కవుట్ అయింది. చివరికి పోటీ విషయంలో కోదండరాంను.. వెనక్కి తగ్గేలా ఒప్పించడంతో.. ఆయనకు టిక్కెట్ ఖరారయింది. ఈ మేరకు పదమూడు మందితో… మూడో జాబితాను విడుదల చేశారు.
టీడీపీ పట్టుబట్టిన ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని సుధీర్ రెడ్డికి కేటాయించారు. టీడీపీ సీనియర్ నేత పోటీ చేస్తారని… అంచనా వేసిన… నిజామాబాద్ రూరల్ స్థానాన్ని .. ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన భూపతిరెడ్డికి కేటాయించారు. భూపతిరెడ్డికి సీటు కేటాయించడంలో.. డీఎస్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. బాల్కొండ నుంచి అనిల్, కార్వాన్ నుంచి ఉస్మాన్ బిన్ అహ్మద్, యాకత్ పురా నుంచి రాజేంద్ర రాజు, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, ఇల్లందు నుంచి హరిప్రియా నాయక్, నిజామాబాద్ అర్బన్ నుంచి తాహిర్ బిన్ , బోధ్ నుంచి సోయం బాపురావు, బహదూర్ పురా నుంచి ఖలీం బాబా, దేవరకొండ నుంచి బాలూనాయక్ లను అభ్యర్థులుగా ప్రకటించారు.
సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి…సనత్ నగర్ నుంచి మొండి చేయి చూపించారు. ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. టీడీపీ తరపున అ స్థానం నుంచి కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేస్తారు. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు.