తప్పుడు కేసులు పెట్టడం – ఊరూరా చెప్పడం అనే దొంగ తెలివితేటల్ని ఏపీ ప్రభుత్వం వాడుకుంటోంది. ఈ విషయంలో సీఐడీ అధికారులు చూపిస్తున్న అత్యాత్సాహం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి తమకు రెండు వారాల సమయం కావాలని అడిగాడు ఇదే అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కానీ ఆయన రోజూ.. టీవీల్లో మాట్లాడతారు. హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఢిల్లీలో కూడా పెడతారు. మరి ఇక్కడ చెప్పే విషయాలు ఎందుకు కోర్టులో చెప్పరంటే దేనికీ సమాధానం లేదు.
మీడియా సమావేశాల్లో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ఒక్క దానికీ సమాధానం చెప్పరు. చంద్రబాబు సంతకాలు పదమూడు చోట్ల ఉన్నాయని సంతకాలు ప్రదర్శించారు. అవి డిజిటల్ అప్రూవ్ సంతకాలు. బిజినెస్ రూల్స్ ప్రకారం జరుగుతూంటాయి. అవి తప్పెలా అవుతాయి… అంటే సమాధానం లేదు. పదమూడు చోట్ల సంతకం పెట్టారని చెప్పిందే చెబుతారు. సంతకం పెట్టడం తప్పెలా అవుతుదో చెప్పారు. డబ్బులు దారి మళ్లాయంటారు.. ఎలా మళ్లాయో విచారణ చేయాలంటారు. చంద్రబాబుకు రూపాయి అందినట్లుగా ఆధారాల్లేవంటారు. దర్యాప్తు చేస్తున్నామంటారు. మరి దర్యాప్తు చేయకుండా ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో అందరికీతెలిసిపోయింది.
చంద్రబాబును తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నట్లుగా.. అరెస్ట్ చేసినట్లుగా జంట కవులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ ఊరూవాడా తిరిగి చెబుతున్నట్లుగా ఉంది. వారి వ్యవహారం న్యాయవర్గాలను సైతం విస్మయ పరుస్తోంది. కోర్టులతో ఆటలాడుకుంటూ.. ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా కేసుల గురించి మాట్లాడుతూండటం… కేసుకు సంబధించిన డాక్యుమెంట్లు బయటపెడుతూండటం.. కలకలం రేపుతోంది. కానీ ఈ కేసులో వ్యవస్థల పనితీరుపైనే అనుమానం ఉంది కాబట్టి .. స్పందిస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిఉంది.