సీబీఐ చార్జిషీట్లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా పిటిషన్ వేయించి జగనే పెట్టించారని తేల్చి చెప్పారు. ఇప్పుడు పిల్లికి ఎలుక సాక్ష్యంలా ఏఏజీ హోదాలో ఉన్న సుధాకర్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టేశారు. ఆయన అలా పెట్టడం.. రాజకీయ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అయినా తాను ఏఏజీ హోదాలో ప్రెస్ మీట్ పెట్టడం లేదని చెప్పి.. షర్మిలపై ఆరోపణలు చేశారు.
అయితే తన ప్రెస్ మీట్ మొత్తం మీద తాను వైఎస్ఆర్ పేరును చార్జిషీటులో పెట్టాలని పిటిషన్ వేయలేదని చెప్పలేదు. వేశానని చెప్పుకున్నారు. కానీ ఆయన జగన్ ఎలా నిందితుడు అవుతారని..జీవోలు ఇచ్చింది ఆయన కాదని పిటిషన్ వేశానని చెబుతున్నారు. అంటే.. వైఎస్ఆర్ మాత్రమే ఆ పని చేయగలరని.. ఆయన మాత్రమే నిందితుడు అవుతారని పొన్నవోలు పిటిషన్ వేసినట్లు. అయితే అసలు విషయం చెప్పకుండా.. జగన్ ను వేధిస్తూంటే చూడలేక పిటిషన్ వేశానని చెప్పుకొచ్చారు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఆ పిటిషన్ వేసినప్పుడు జగన్ ఎవరో తెలియదట. జగన్ ఎవరో తనకు తెలియకుండానే పిటిషన్ వేశారట. ఆయన పిటిషన్ ద్వారా వైఎస్ఆర్ పేరు చార్జిషీట్ లో చేరితే జగన్ పిలిచి ఏఏజీ పదవి ఇచ్చారట.
శంకర్ రావు పిటిషన్ వేశారని.. ఎరన్నాయుడు ఇంప్లీడ్ అయ్యారని పాత కథ అంతా పొన్నవోలు చెప్పుకొచ్చారు కానీ..తన పిటిషన్ గురించి మాత్రం ఆయన అరకొర సమాచారం చెప్పారు. జగన్ కు సంబంధం లేదని చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. జగన్ తనకు ఈ పటిషన్ వేసినందుకు పదవి ఇవ్వలేదని తన టాలెంట్ ను చూసి ఇచ్చారన్నారు. ఈ మధ్య కాలంలో నా టాలెంట్ షర్మిల చూడలేదా అని కూడా ఆయన డైలాగ్ చెప్పారు. మొత్తానికి ఒక్కో విషయం బయటకు వచ్చే కొద్దీ వైఎస్ జగన్ కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.