వైసీపీకి ఏస్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన ధైర్యం ఏమిటో చెప్పారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు ఆతిధ్యాన్ని స్వీకరించిన ఆయన .. తనను చూసేందుకు వచ్చిన అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తమ ధైర్యానికి కారణం ఏమిటో చెప్పారు. భయం అంటే ఏమిటో తెలియదని.. జాతస్యం మరణం ధృవం అని అనుకుని పోరాడతామన్నారు. పుట్టిన వాడు గిట్టక మానడని చెప్పుకొచ్చారు. ఈ డైలాగ్ పొన్నవోలు నోటి నుంచి చాలా సార్లు వచ్చింది. ఆయనకు భగవద్గీతలో ఇదొక్కటే తెలుసా లేకపోతే.. ఎక్కడైనా విని బాగుందని పదే పదే చెబుతున్నారా అన్నది చాలా మందికి వచ్చే డౌట్.
ఆయన మాట్లాడే మాటలు వింటే లాయర్ ఎలా అయ్యాడో చాలా మందికి అర్థం కాదు. బేసిక్స్ కూడా తెలియని లాయర్ అని ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఆయన రాజకీయం కూడా అంతే ఉంటుంది. చంద్రబాబును రిమాండ్ కు పంపేలా చేసింది తన వాదనలేనని చెప్పుకుంటారు కానీ.. అసలు స్టేషన్ బెయిల్ రావాల్సిన కేసుల్లో పార్టీ కార్యకర్తలను .. నేతలను జైలుకు పంపిన రికార్డు ఆయన సొంతం. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు ఓ సారి ఆస్ట్రేలియా వెళ్లి తాను ఫ్యాక్షనిస్టునని చెప్పుకున్నారు. జగన్ గెలవగానే.. ప్రత్యర్థుల్ని నరికేయడానికి పర్మిషన్ ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం మాట కంటే ముందు జాతస్యం మరణం ధృవం అంటున్నారు.
తాము అధికారంలోకి రాగానే సినిమా చూపిస్తామని కూడా పొన్నవోలు అంటున్నారు. అసలు వారు సీరియల్లో..సినిమానో చూపించబట్టే కదా ఇప్పుడు వారికి త్రీడీ సినిమాలు చూపిస్తున్నారని ఎక్కువ మంది అంటూంటారు. వారు పద్దతిగా పని చేసిఉంటే.. ఇప్పుడు ఇలా పుట్టినవాడు గిట్టక మానరని నిర్వేదం చెందాల్సిన పరిస్థితి వచ్చేది లేదు.