పోసాని కృష్ణమురళికి సినిమాలో ఎదురైన సీన్ నిజంగానే ఎదురయ్యే పరిస్థితి కనిపించనుంది. పోలీసులు అరెస్టు చేసిన పోసాని కృష్ణమురళిని కోర్టు రిమాండ్ కు తరలించకుండా ఉండేలా చూసేందుకు జగన్మోహన్ రెడ్డి తన ఆస్థాన లాయర్ నిరంజన్ రెడ్డిని కాకుండా.. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అన్నమయ్య జిల్లాకు పంపించారు. ఆయన వాదనా పటిమపై వైసీపీ నేతలే జోకులేస్తూంటారు. చెప్పిందే చెప్పి జడ్జిలను విసిగిస్తూంటారు. జడ్జిలపై కోపం తెచ్చుకుని పార్టీ నేతల్ని జైలుకు పంపించే వరకూ ఊరుకోరు. ఇప్పుడు పోసానికీ అదే పరిస్థితి ఏర్పడనుంది.
ఓ సినిమాలో చిన్న కేసును.. లాయర్ సప్తగిరి పెద్దది చేసి ఉరిశిక్ష పడేలా చేస్తాడు. ఇప్పుడు పొన్నవోలు కూడా పొసానికి అదే గతి పట్టించినా ఆశ్చర్యం లేదు. ఆయన వాదనలు అంత గొప్పగా ఉంటాయి. చంద్రబాబు రిమాండ్ రిపోర్టు కొట్టి వేయకుండా ఏసీబీ కోర్టులో ఆయన వాదించారు. గవర్నర్ అనుమతి లేకపోయినా కోర్టు రిమాండ్ కు తరలించారు. తర్వాత అదే కోర్టు చార్జిషీట్లు తీసుకోవడానికి గవర్నర్ అనుమతి లేదన్న కారణంగా నిరాకరించింది. ఆ తర్వాత ఎన్ని విచారణలు జరిగినా ఒక్క దాంట్లోనూ తన ప్రతిభ చూపించలేకపోయారు. ఇంకా చెప్పాలంటే చాలా మందిని ఆయన ఇరికించి జైలుకు పోయేలా చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన తరపున వాదించడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపడంతో.. ఇక సరిపోయినట్లే అనుకుంటున్నారు వైసీపీ నేతలు. రిమాండ్ తిరస్కరించేందుకు ఏ మాత్రం అవకాశం ఉన్నా.. అది పన్నవోలు వాదనలతో మూసుకుపోతుందని.. పోసాని జైలుకు పోవడం ఖాయమని వైసీపీ నేతలు గొణుక్కుంటున్నారు.