ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అరవింద సమేత’. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వినీదత్ నిర్మిస్తున్న సినిమాలోనూ పూజా హెగ్డేయే హీరోయిన్. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. రెండింటిలోనూ పూజా హెగ్డే మీద సన్నివేశాలు తీసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఇటు చూస్తే మహేష్ బాబు సినిమా. అటు చూస్తే ఎన్టీఆర్ సినిమా. ఎవరి సినిమాకీ నో చెప్పలేని పరిస్థితి. దాంతో రెండు సినిమాల సెట్స్ మధ్య పూజా హెగ్డే చక్కర్లు కొట్టింది. ఓ సెట్లో సీన్ కంప్లీట్ చేశాక… మరో సెట్లో ఎంటరయ్యి అక్కడ షూటింగ్ చేశారు. గతంలో హీరో హీరోయిన్లు ఇదే విధంగా షూటింగ్ చేసేవారు. రోజుకి రెండు షిఫ్టులు, మూడు షిఫ్టులు లెక్కన పనిచేసేవారు. టెక్నాలజీ గట్రా పెరిగిన తరవాత సీన్ తీయడానికి ఎక్కువ సమయం పడుతోంది. రెండు మూడు కెమెరా యాంగిల్స్‌లో షాట్స్ తీయడమూ ఆలస్యానికి ఓ కారణం అవుతోంది. దాంతో స్టార్ హీరోలు ఒక్కొక్క సినిమా మాత్రమే చేస్తూ వస్తున్నారు. హీరోయిన్లకు మాత్రమే అప్పుడప్పుడూ ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.