టాలీవుడ్ అంటేనే సెంటిమెంట్ల మయం. ఫలానా హీరోయిన్ ఉంటే, సినిమా సూపర్ హిట్టని నమ్మారంటే – ఆ హీరోయిన్ జాతకం మారిపోయినట్టే. తాను కూడా అలానే సినిమా `రాత`ని కూడా మార్చేస్తూ ఉంటే, తను లక్కీ గాళ్ అయిపోతుంది. ఆ ముద్ర పూజా హేగ్డేపై ఎప్పుడో పడిపోయింది. పూజా చేసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టే. అందుకే తను అదృష్ట కథానాయిక అయిపోయింది. ఆ అదృష్టం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`కీ పట్టేసింది.
అఖిల్, హలో, మిస్టర్ మజ్ను.. ఇలా సినిమాలపై సినిమాలు చేసినా – అఖిల్ కి ఒక్క బ్రేక్ కూడా రాలేదు. తన ఆశలన్నీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`పైనే పెట్టుకున్నాడు. దసరా సందర్భంగా విడుదలైన ఈసినిమాకి ఓ మోస్తరు రేటింగులు వచ్చాయి. కాకపోతే.. వసూళ్లు మాత్రం జోరుగానే ఉన్నాయి. దసరా సందర్భంగా విడుదలైన మూడు సినిమాల్లో.. బ్యాచిలర్ దే అప్పర్ హ్యాండు. ఓవర్సీస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మిగిలిన ఏరియాల్లోనూ త్వరలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సుంది. ఇదంతా పూజా హెగ్డే చలవే అన్నది ఇండ్రస్ట్రీ వర్గాల మాట. ఈ సినిమాకి యువతరం ప్రేక్షకులే మహారాజ పోషకులు. వాళ్లంతా పూజా కోసమే థియేటర్లకు వెళ్తున్నారని టాక్. దాంతో పాటుగా పూజా క్యారెక్టర్ కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. పూజా హెగ్డే ది గోల్డెన్ లెగ్ కాబట్టే, వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ కి ఉపశమనం కలిగిందని, మిక్డ్స్ రివ్యూలు వచ్చినా – బ్యాచిలర్ గట్టెక్కగలిగాడని పూజా ఫ్యాన్స్ చెబుతున్నారు. అలాగైతే… ఈ గోల్డెన్ లెగ్ కి మరింత డిమాండ్ పెరిగిపోవడం ఖాయం.