హీరోలు, దర్శకులు అప్పుడప్పుడూ గొంతు సవరించుకోవడం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్లలోనూ సింగర్లు తయారవుతున్నారు. ఆ లిస్టులోకి పూజా హెగ్డే చేరిపోయింది. తన కొత్త సినిమాలో పూజా తన పాట తానే పాడుకోనుంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజానే కథానాయిక. ఈ సినిమా కోసం పూజ తొలిసారి గాయని అవతారం ఎత్తబోతోంది. అందుకోసం తమన్ ఓ మంచి ట్యూన్ సిద్ధం చేశాడని సమాచారం.
“నాకు చిన్నప్పటి నుంచీ సంగీతం అంటే ఇష్టం. ఖాళీ సమయాల్లో పాటలు పాడుకుంటుంటా. అయితే ప్రొఫెషనల్ సింగర్‌ని మాత్రం కాను. కాకపోతే సినిమాల్లో పాడాలని ఆశగా ఉంది“ అని ఇది వరకే పూజా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఆ అవకాశం త్రివిక్రమ్ సినిమా ద్వారా దొరికేసింది. ఇక మీదట పూజా సినిమాల్లో పాటల కోసం గాయనీమణుల్ని వెదుక్కునే అవసరం తప్పినట్టుంది.