ఎట్టకేలకు మార్చి 11న రావడానికి `రాధేశ్యామ్` ఫిక్సయ్యింది. సంక్రాంతి టైమ్‌లో రిలీజ్ అన్నప్పుడు.. ఆర్.ఆర్.ఆర్ భారీ ప్రమోషన్లు చేసింది గానీ, రాధేశ్యామ్ ఏం పట్టించుకోలేదు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి చేశారంతే. బాలీవుడ్ లో అయితే.. ప్రమోషన్లే మొదలు పెట్టలేదు. మరోసారి తమ సినిమాని వాయిదా వేయాల్సివస్తుందని టీమ్ ముందే గ్రహించింది. అయితే మార్చి 11న మాత్రం `రాధే శ్యామ్` రావడం ఖాయం. ఈసారి లెక్క తప్పదు. ఈనెల చివరి వారం నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా దాదాపుగా ప్రిపేర్ అయిపోయింది. చివరి రెండు వారాలూ… గట్టిగా ప్రమోషన్లు చేయాలని నిర్మాతలు ఫిక్సయ్యారు.
అయితే ఈ ప్రమోషన్లకు పూజా హెగ్డే డుమ్మా కొట్టబోతోందని టాక్. రాధే శ్యామ్ టీమ్‌తో పూజా కాస్త అసంతృప్తిగా ఉందని టాక్. ప్రభాస్ కీ పూజాకీ పడడం లేదని కూడా చెప్పుకున్నారు. మరోవైపు మార్చిలో పూజా ఫుల్ బిజీ. అటు తమిళం, ఇటు హిందీ సినిమాలకు పూజా డేట్లు ఇచ్చేసింది. అందులోంచి ఒక్క రోజు కూడా `రాధేశ్యామ్` టీమ్ కోసం కేటాయించలేని పరిస్థితుల్లో ఉన్నానని పూజా చెబుతోందట. ఆయా నిర్మాతలేమైనా దయ దలిస్తే.. ఒకటీ, రెండు రోజులు మాత్రం రాధే శ్యామ్ కి ఇవ్వగలదు. నార్త్ లో.. ప్రభాస్, పూజాలతో పాటు, చిత్రబృందం మొత్తాన్ని తీసుకెళ్లి.. ఓ ఈవెంట్ చేయాలనుకుంటున్నారు. హీరోయిన్ లేకపోతే ప్రమోషన్లకు కళేముంటుంది? ఈ సినిమాలో ఒకే ఒక్క హీరోయిన్ ఆయె. తెలుగులో ఈవెంట్లకు రాకపోయినా, బాలీవుడ్లో అయినా పూజా మెరిస్తే బాగుంటుందని అందరి కోరిక.