ఏప్రిల్ ఫూల్ అంటూ ఏడిపించడానికి మరో రెండు నెలల సమయం ఉంది. కానీ పూనమ్ పాండేకి అన్ని రోజులు ఆగే ఓపిక లేదేమో..? ముందే ఫూల్స్ డే సెలబ్రేట్ చేసేసింది. ఒకర్ని కాదు, ఇద్దర్ని కాదు. ఏకంగా ప్రపంచాన్నే నమ్మించేసింది. తన చావుపై తానే జోక్ వేసుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కింది పూనమ్.
పూనమ్ పాండే చనిపోయిందన్న వార్త నిన్న పొద్దుట నుంచీ వైరల్ అవుతోంది. పూనమ్ ఇన్‌స్టాలో మేనేజర్ స్వయంగా ఈ వార్త పోస్ట్ చేసేసరికి నమ్మేశారంతా. దాంతో మీడియా పూనమ్ చనిపోయిందన్న వార్తని బాగానే హైలెట్ చేసింది. టీవీలు, వెబ్ సైట్లు పూనమ్ మృతికి సంబంధించి వార్తలు కవర్ చేశాయి. అంతెందుకు ప్రధాన పత్రికలన్నీ పెద్ద పెద్ద హెడ్డింగులతో పూనమ్ ఇక లేదంటూ.. కథనాలు ప్రచురించాయి. తీరా చూస్తే ‘తూచ్.. నేను బతికే ఉన్నా’ అంటూ పూనమ్ ఎంట్రీ ఇచ్చేసింది. సర్వైకల్ కాన్సర్ వ్యాధిపై జనంలో అవగాహన తీసుకురావడానికే తాను ఈ పని చేశానంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో.. మీడియా ఒక్కసారిగా అవాక్కయ్యింది.
పూనమ్ ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ పూనమ్ మృతి వార్త ప్రచురించిన ప్రధాన పత్రికలు ఈ విషయమై ఫ్యాక్ట్ చెక్ ఎందుకు చేయలేదో అర్థం కాదు. వెబ్ సైట్లూ, టీవీ ఛానళ్లది తొందర వ్యవహారం. ఓ వార్తని వీలైనంత త్వరగా ప్రేక్షకులకు చేరవేయాలన్న కుతూహలం. వాళ్లకు ఫ్యాక్ట్ చెక్ చేసేంత టైమ్ ఉండదు. కానీ ప్రధాన పత్రికలకు ఏమైంది? వాళ్లైనా చెక్ చేసుకోవాలి కదా? మూడు రోజుల క్రితం వరకూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్న పూనమ్, సడన్‌గా చనిపోయిందంటే ఎలా నమ్మారు? పైగా అదీ కాన్సర్‌తో. కాన్సర్ ట్రీట్ మెంట్ ఏ రూపంలో ఉంటుందో ఎవరికీ తెలీదా? ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ.. పూనమ్ మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో డాన్సులు చేస్తూ ఎలా కనిపించింది? కనీసం ఈ లాజిక్ ని కూడా ఎలా పక్కన పెట్టేశారు? చావు వార్తలు రాసేటప్పుడు ప్రింట్ మీడియా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఒకటికి పది సార్లు చెక్ చేసుకొంటుంది. అలాంటిది కేవలం ఓ సోషల్ మీడియా పోస్ట్ ని బేస్ చేసుకొని కథనాన్ని నమ్మిందంటే ఏమనుకోవాలి? పూనమ్ ఇది పబ్లిసిటీ కోసం చేసినా, కేవలం సోషల్ మీడియా పోస్టులపై పత్రికలు, టీవీ ఛానళ్లూ ఎంతగా ఆధారపడిపోతున్నాయి అని చెప్పడానికి ఇదో నిదర్శనంలా కనిపించింది. పూనమ్ చర్య ఎవరూ సమర్థించరు. కాకపోతే.. ఇది మీడియాకు వేకప్ కాల్.