పెద్దగీత పక్కన చిన్న గీత గీస్తే.. అది చిన్న గీతే…! ఆ చిన్న గీత కింద పక్కన మరింత చిన్న గీత గీస్తే.. అది పెద్ద గీత అవుతుంది..!. ఇది అందిరికీ తెలిసిన విషయమే. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియలేదా..? పాతిక లక్షల మందితో నభూతో అన్నట్లుగా సభ నిర్వహిస్తామని… కేసీఆర్.. పదే పదే ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనలను అందరూ సీరియస్‌గా తీసుకున్నారు. నిజంగానే అంత మందిని.. కొంగరకలాన్‌కు తీసుకు వచ్చి.. దేశం మొత్తం తన వైపు తిప్పుకుంటారేమో అని ఆశించారు. నిజమో కాబోలు అని జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా వచ్చింది. వారికి కేటీఆర్, కవితలు ఇంటర్యూలు కూడా ఇచ్చారు. తీరా చూస్తే.. సభకు వచ్చిన జనం.. ఐదు లక్షలకు అటూ ఇటుగానే ఆగిపోయింది. నిజానికి ఇది తక్కువేమీ కాదు. కానీ కేసీఆర్ పదే పదే పాతిక లక్షలు, పాతిక లక్షలు అని చెబుతూ ఉండటం వల్ల ఇది చాలా చిన్న అంకెగా కనిపిస్తోంది. తనే స్వయంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేయడం వల్ల వచ్చిన సమస్య ఇది..?
నిజానికి కేసీఆర్ రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న నేత. తన చేతిలో ప్రభుత్వం ఉంది. గ్రామగ్రామల విస్తరించిన పార్టీ నేతలు ఉన్నారు. అయినా సరే.. పాతిక లక్షల మందిని ఒక్క చోటకు తీసుకు రావడం అసాధ్యమన్న సంగతిని ఎందుకు గుర్తించలేకపోయారు..? తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల నుంచి ఒక్కో నియోజకవర్గం నుంచి యావరేజ్‌గా 20 వేల మందిని తరలిస్తేనే.. లక్ష్యం చేరుకుంటారు. అది సాధ్యమేనా..? హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు..తమకు లభించే ఒక్క ఆదివారాన్ని రాజకీయ సభల కోసం కేటాయించే అవకాశం ఉండదు. బస్తీల్లోని వాళ్లు కూడా.. డబ్బులిస్తామన్నా.. రారు. ఇక ఆదిలాబాద్ లాంటి జిల్లాల నుంచి వచ్చే వాళ్లు వందల్లోనే ఉంటారు. సిద్దిపేట లాంటి పట్టు ఉన్న జిల్లాల నుంచి సాధ్యమైనంతగా.. జనాలను తరలించబట్టే ఈ ఈ మాత్రం జన సందోహం కనిపించింది. రాజకీయాల లెక్కలు ఎప్పుడూ కాస్త తేడాగనే ఉంటాయి. పది వేల మంది వచ్చిన చోట్ల లక్ష మంది అని .. లక్ష మంది వచ్చిన చోట..నాలుగు లక్షలని చెప్పుకుంటారు. కానీ.. నాలుగైదు లక్షల్ని పాతిక లక్షలుగా చెప్పుకోవడం… అంటే.. కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది.
లక్షల్లో జనం వచ్చారని చెప్పుకోడానికి… రెండు రోజుల ముందుగానే.. దూర ప్రాంతం నుంచి వాహనాలు బయలుదేరాయని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి వాహనాల్లో డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేరు. ప్రారంభించేటప్పుడు.. ఎక్కిన వారు కూడా.. కాసేపటికే మాయమయ్యారు. అవి డ్రోన్ కెమెరా దృశ్యాలు తీసుకోవడానికే పనికి వచ్చాయి. ట్రాక్టర్లన్నీ… భారీగా వాహనాలు వచ్చాయని చెప్పుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతలు ఏర్పాటు చేసిన బస్సులు… చాలా వరకు ఖాళీగా వచ్చాయి. ఖాళీగా వెళ్లాయి. అంటే జనసమీకరణలో నేతలు పూర్తిగా విఫలమయ్యారు. తమ స్థాయిలో.. నాలుగైదు ఐదు వేల మందిని తీసుకు వస్తాం కానీ.. అంత మందిని ఎక్కడ నుంచి తీసుకు రాగలమని నేతలు కూడా.. ఊసురుమన్నారు.
జనసమీకరణకలో కేసీఆర్ అంచనాలు తప్పడానికి మరో స్పష్టమైన కారణం కూడా ఉంది. అదే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఖరారు చేయడం. సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఇస్తానని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. దాంతో… టిక్కెట్ ఖరారయిందని ఎమ్మెల్యేలు.. తాము ఎంత మందిని సభకు తీసుకు వెళ్లినా తమకు చాన్స్ లేదని మిగతా వారు సైలెంటయ్యారు. తమ తమ ఇలాఖాల్లో ఫ్లెక్సీలు పెట్టించుకుని…తాము సభ కోసం గట్టిగా ప్రయత్నించామని కేసీఆర్ దృష్టిలో పడేందుకు కొన్ని టీవీ, పేపర్ ప్రకటనలు ఇచ్చుకున్నారు. కేసీఆర్ అంచనా ప్రకారం..అందరూ పోటీ పడి జన సమీకరణ చేస్తారనుకున్నారు. కానీ అది తేలిపోయింది. నిజానికి ఇప్పుడు ఏ రాజకీయ నేత సభ పెట్టినా.. స్వచ్చందంగా ఎవరూ రావడం లేదు. గిట్టుబాటయితేనే వస్తున్నారు. అలా గిట్టుబాుట చేయడానికి టీఆర్ఎస్ నేతలు సిద్ధపడలేదు. మొత్తానికి ప్రగతి నివేదన సభ… జనసమీకరణలో ఫ్లాప్ ముద్ర వేయించుకుంది.