“పేదలే నిజాయితీపరులు…సంపన్నులు ప్రభుత్వాన్ని, బ్యాంకులను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు,” ఇది సంపన్నుల గురించి ప్రధాని నరేంద్ర మోడి వ్యక్తం చేసిన అభిప్రాయం. ఆయన నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, సంపన్నులు, కార్పోరేట్ సంస్థల, దేశాధినేతలతోనే కలిసి తిరగడానికి ఇష్టపడతారు..వారికే ఆయన లబ్ది చేకూర్చేందుకు ఎక్కువ ఇష్టపడతారనే విమర్శలు, అపవాదుని నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు. రైతుల హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు గత యూపియే ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టాన్ని సవరించేందుకు ఆయన చేసిన విఫలయత్నాలే అందుకు ఒక చక్కటి ఉదాహరణ. అటువంటి వ్యక్తి సంపన్నుల కంటే పేదవారే నిజాయితీపరులని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్టాండ్ అప్ ఇండియా పధకాన్ని నిన్న నోయిడాలో ప్రారంభిస్తూ మోడీ ఈ మాటలు అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే “ పేదవారు కష్టపడి పైసాపైసా కూడబెట్టి బ్యాంకులలో చిన్న చిన్న మొత్తాలు జమా చేస్తుంటే, సంపన్నులు బ్యాంకులకు వేలకోట్లు టోపీ పెట్టి వాటిని నిలువునా ముంచేస్తున్నారు. వాళ్ళు బ్యాంకులకు గుదిబండలుగా మారారు. పన్నులు ఎగవేయడానికి మార్గాలు వెతుకుతున్నారు. అటువంటి వాళ్ళు అందరూ దేశంలో నిరుపేదల నిజాయితీని చూసయినా సిగ్గుపడాలి.” అని అన్నారు.
బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా వంటి వారిని ఉద్దేశ్యించే ఆయన ఆవిధంగా మాట్లాడుతున్నారని అర్ధమవుతూనే ఉంది. అతను ఒక ఆర్ధిక నేరస్తుడని బలంగా నమ్ముతున్నా కూడా నిర్భయంగా విజయ్ మాల్యా పేరుని ప్రస్తావించలేకపోవడం, ఆ వేదిక ద్వారా ఆయనతో సహా అటువంటివారందరికీ గట్టి హెచ్చరిక పంపలేకపోవడం గమనిస్తే మోడీ చెపుతున్న ఆ మాటలు దేశంలో సామాన్య ప్రజలను ఆకట్టుకోవడానికి మాత్రమేనని అర్ధమవుతోంది.
అయినా సమాజంలో ఒక వర్గంవారందరూ చాలా మంచి వాళ్ళు, మరోకవర్గం వాళ్ళందరూ చాలా చెడ్డవాళ్ళు అని ఎన్నడూ నిర్దారించలేము. సంపన్నులలో నిజాయితీ, దేశభక్తి కలిగి నిసార్ధంగా సమాజసేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అవినీతిపరులు కూడా ఉన్నారు. అలాగే సామాన్యులలో కూడా ఉన్నారు.
తెదేపా అధికారంలోకి రావడం కోసం పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చాలా గట్టిగా ప్రచారం చేయడంతో, ఆ అవకాశాన్ని సద్వినియోగ (దుర్వినియోగ) పరుచుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో వేలాది మంది సామాన్య ప్రజలే నకిలీ ఖాతాలు, పత్రాలతో వేర్వేరు బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణాలు తీసుకొన్నారని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. అంటే సామాన్యులందరూ కూడా నిజాయితీపరులు కాదని అర్ధమవుతోంది.
మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధన్ జన్ యోజన’ పధకం ద్వారా దేశంలో కోట్లాది మంది నిరుపేద ప్రజల పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిచినా మాట నూటికి నూరు శాతం నిజం. కానీ ఆ ఖాతాల వలన బ్యాంకులకు అదనపు పనిభారం పెంచినట్లు అయ్యిందే తప్ప వాటికి కానీ, పేదలకి గానీ ఒరిగిందేమీ లేదు. తెదేపా ప్రకటించిన పంట రుణాల మాఫీ హామీ వలన అటు నిజంగా కష్టాలు పడుతున్న రైతులకి కానీ, బ్యాంకులకి గానీ ఎటువంటి ప్రయోజనము కలుగలేదు. పైగా అందరూ నష్టపోయారు. బ్యాంకులకు ఈ దుస్థితి కల్పించిన రాజకీయ పార్టీలు, విజయ్ మాల్యా వంటివారు విదేశాలకు పారిపోతుంటే అడ్డుకోని ప్రభుత్వాలు అందరూ కూడా ‘తిలా పాపం తలో పిడికెడు’ అన్నట్లుగా ఈ అవినీతి, పాపంలో భాగస్తులేనని చెప్పకతప్పదు.
ఇప్పుడు ఈ ‘స్టాండ్ అప్ ఇండియా’ పధకం మోడీ ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశ్యంతోనే మొదలుపెడుటోంది. దాని ద్వారా దేశంలోని నిరుపేద దళిత, గిరిజన వర్గాల ప్రజలకు స్వయం ఉపాధి మార్గం చూపాలనుకోవడం హర్షణీయమే. ఈ పధకం ద్వారా దేశంలో గల అన్ని బ్యాంకులు ఒక్కొక్కటి కనీసం ఇద్దరు దళిత, గిరిజన మహిళా వ్యాపారవేత్తలకు ఎటువంటి హామీ కోరకుండా రూ.10 లక్షల నుంచి కోరి రూపాయల వరకు రుణాలు మంజూరు చేయవలసి ఉంటుంది.
దేశంలో వివిధ బ్యాంకులకు మొత్తం 1.25 లక్షల శాఖలున్నాయి. అవి ఒక్కోటీ ఇద్దరికి అంత సొమ్ము రుణంగా ఇవ్వాలంటే ఎంతవుతుందో లెక్క కట్టడం కూడా కష్టం. అది కూడా ఎటువంటి హామీ లేకుండా ఇవ్వాల్సి ఉంటుంది కనుక ఆ డబ్బు వాపసు వస్తుందనే నమ్మకాలు కూడా పెట్టుకోనవసరం లేదు. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూసేవాళ్ళు దేశంలో కోట్లాదిమంది అవినీతిపరులున్నారు. వారు నిరక్షరాస్యులయిన గిరిజన మహిళలను అడ్డుపెట్టుకొని బ్యాంకులను దోచుకోకుండా ఉంటారా? అని ఆలోచిస్తే ఈ పధకంలో సొమ్ము వాపసు కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలసి ఉందో, నిర్లక్ష్యం వహిస్తే దేశ ఆర్ధిక వ్యవస్థపై అది ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందో ఊహించుకోవచ్చును.
కనుక ప్రభుత్వాలు తమ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశంలో ఏదో ఒక వర్గం ప్రజలను ఆకట్టుకోవడానికో లేక వారిని సంతృప్తిపరచడానికో ప్రయత్నించడం వలన దేశానికి, ప్రజలకి కూడా లాభం కంటే నష్టం కలిగే అవకాశాలే ఎక్కువ.