చిత్రసీమలో బోలెడన్ని సెంటిమెంట్లు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఓ సెంటిమెంట్ నడిపిస్తుంటుంది. రవిబాబుకీ చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. తన సినిమాలో ఏదో ఓ ఫ్రేమ్‌లో ఆయన కూడా కనిపించడం ఓ ఆనవాయితీగా మారింది. ఇప్పుడు `పూర్ణ` కూడా తన సెంటిమెంట్ లో భాగమైపోయింది. `అవును` కోసం పూర్ణని హీరోయిన్గా తీసుకున్నాడు రవిబాబు. ఆసినిమా హిట్టయ్యింది. ఆ సెంటిమెంట్‌తోనే `అవును 2`, `లడ్డూ బాబు`లలోనూ పూర్ణని కథానాయికగా తీసుకున్నాడు. రెండూ ఫ్లాపులే. కానీ రవిబాబు సెంటిమెంట్‌ని మాత్రం వదల్లేదు. ఇప్పుడు `అదిగో`లోనూ ఆమెకు చోటిచ్చాడు. పూర్ణ కోసం ఓ ఐటెమ్ పాట డిజైన్ చేసి వదిలాడు.
నిజానికి `అదిగో` సినిమా ఎప్పుడో పూర్తయిపోయింది. ఐటెమ్ పాట మాత్రం ఇప్పుడు షూట్ చేసి అతికించారు. ఇదంతా పూర్ణ కోసమే అని టాక్. రవిబాబు సినిమాల్లో ఐటెమ్ గీతాలుండవు. ఈచిత్రానికి నిర్మాత అయిన సురేష్ బాబు కూడా ఇలాంటి ఎగస్ట్రా వ్యవహారాలకు దూరం. సినిమా కథకి అవసరం లేని పనిని ఆయన ఎప్పుడూ… ప్రోత్సహించడు. కేవలం రవిబాబు కోసమే ఐటెమ్ పాటకు ఒప్పుకున్నట్టు సమాచారం. కథలో ఐటెమ్ గీతానికి ఏమాత్రం ఛాన్సు లేకపోయినా పూర్ణని తీసుకొచ్చి ఓ పాట చేయించేశారని తెలుస్తోంది. అదిగో ఓ పంది పిల్ల కథ. తెలిసిన మొహాలెవరూ ఉండరు. కమర్షియల్ విలువల్ని జోడించడానికే తొలిసారి రవిబాబు.. ఐటెమ్ గీతాల దారి ఎంచుకున్నాడేమో అనిపిస్తోంది. దానికి తోడు.. పూర్ణకి కూడా ఏదో ఓ రోల్ ఇవ్వనిదే.. ఆయన సినిమా పరిపూర్ణం అవ్వడం లేదాయె. అందుకే… చివరి నిమిషంలో ఈ మార్పులకు పూనుకున్నాడు రవిబాబు.