జీవితం వడ్డించిన విస్తరికాదు. ఈ విషయం పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావుకి బాగా తెలుసు. జీవితంలోని ఆటుపోట్లు ఎదుర్కుంటూ స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి ఏడిద. వీరు 1987లో స్వయంకృషి పేరిట సినిమా తీయడానికి ముందుకు వచ్చినప్పుడు చిరంజీవి వంటి మాస్ హీరోచేత ఈ సినిమా ఎలా తీస్తారన్న సందేహం చాలామందిలో కలిగింది. అయితే కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో ఏడిదగారు అద్భుతమైన రీతిలో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది 25 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. సాంబయ్య పాత్రలో ప్రదర్శించిన అభినయానికిగాను తొలిసారి ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్నారు చిరంజీవి. ఇవ్వాళ ఏడిదగారి సినిమాల గురించి కన్నీటిని దిగమింగుకుంటూ గుర్తుచేసుకోవాల్సివస్తున్నది. ఎందుకంటే… ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఏడిద నాగేశ్వరరావుగారు ఇక లేరు.
శంకరాభరణం, సిరిసిరిమువ్వ, స్వాతిముత్యం, ఆపద్భాందవుడు, స్వరకల్పన, సాగరసంగమం, సీతాకోకచిలుక వంటి ఎన్నో క్లాసికల్ మూవీస్ ని ఏడిదగారు తెలుగు ప్రేక్షకులకు అందించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఏడిదగారు ఆదివారం హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు.
మంచి సినిమాలు తీయాలన్న ఆలోచన నిర్మాణ సంస్థకు ఉంటే అలాంటి కథలే ఆ సంస్థ దగ్గరకు నడుచుకుంటూ వస్తాయి. అందుకు తగ్గట్టుగా దర్శకులు, నటీనటులు, సంగీత దర్శకుడు…ఇలా ఒకరేమిటీ సినీపరిశ్రమకు అవసరమైన 24 ఫ్రేమ్ ల్లోనూ క్లాసికల్ టచ్ ఇచ్చే నిపుణులు తోడవుతారు. మేలైన నిర్మాణబృందం కలసికట్టుగా పనిచేస్తే చివరకు ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించానన్న తృప్తి నిర్మాతకు మిగులుతుంది. ఏడిదగారిని ఎవరైనా కదిలిస్తే ఇదే చెప్పేవారు.
ఆయన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో 1934 ఏప్రిల్ 24న జన్మించారు. చిత్రనిర్మాణ సంస్థ అధినేతగా అందరికి తెలిసిన ఏడిదగారు పూర్వరంగంలో నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆ తర్వాతనే ఆయన సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉంటూ చిత్రనిర్మాణరంగంవైపు మొగ్గుచూపారు. దీంతో పూర్ణోదయ మూవీ క్రియేషన్ సంస్థ ఏర్పాటైంది. ఆయన తీసిన క్లాసికల్ సినిమాలు నిజంగానే పూర్ణ చంద్రోదయంలా వెన్నెల విరగబూయించేవి. జాతిరత్నాల్లాంటి సినిమాలు అందించడంలో కె.విశ్వనాథ్ కు సరితూగే వ్యక్తిగా ఏడిదగారన్నమాట చిత్రపరిశ్రమలో స్థిరపడింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `శంకరాభరణం’ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అలాగే, సాగరసంగమం, సితార వంటి చిత్రాలకు కూడా జాతీయ అవార్డులొచ్చాయి. ఏడిద ఇక లేరని తెలియగానే ఆయనతో కలిసిపనిచేసిన విశ్వనాథ్ కంటతడిపెట్టారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా పలువురు నాయకులు, చిత్రసీమ ప్రముఖులు ఏడిద మృతిపట్ల తీవ్రసంతాపం వ్యక్తంచేశారు. తెలుగు చిత్రసీమలో ఆణిముత్యాల్లాంటి సినిమాలు వస్తున్నంతసేపు ఏడిదగారిని తెలుగు ప్రేక్షకలు మరచిపోలేరు. ఇదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.
– కణ్వస