తమిళ నాట పాపులారిటీ, క్రేజ్, మార్కెట్.. ఈ విషయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు అజిత్. ఓ రకంగా చెప్పాలంటే రజనీ, విజయ్‌ల తరవాత.. అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోతను. అయితే చాలా విషయాల్లో వీరిద్దరికంటే అజిత్ భిన్నంగా కనిపిస్తాడు. ఎన్నికల సమయంలో క్యూలో నిలబడి మరీ ఓటేసే అజిత్ వ్యక్తిత్వం చాలామందిని ఆకర్షించింది. తనో స్టార్ అనే భావన ఎప్పుడూ ఎక్కడా కనిపించనివ్వడు. తన అభిమానులతో కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాడు. తాజాగా.. తన అభిమాన సంఘాలన్నింటికీ రద్దు చేసి షాక్ ఇచ్చాడు అజిత్. అభిమాన సంఘాల పేరిట… రచ్చ పెరిగిపోతోందని, హీరోల మధ్య వైరం ఎక్కువ అవుతోందని గ్రహించిన అజిత్… ‘నా పేరుతో ఒక్క అభిమాన సంఘం కూడా ఉండడానికి వీల్లేదు. అలా ఉంటే మీపై చర్యలు తీసుకుంటా’ అని ఫ్యాన్స్‌కే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
ఏ హీరోకైనా బలం, బలగం.. తన అభిమానులే. వాళ్ల వల్లే ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా బాగున్నా, బాగోకపోయినా నెత్తిమీద పెట్టుకునేది వాళ్లే. అయితే అలాంటి ఫ్యాన్స్‌ని కంట్రోల్లో ఉంచడం చాలా కష్టం. అందుకే చాలామంది స్టార్ హీరోలు బయట అభిమాన సంఘాల పేరుతో ఎంత రచ్చ జరుగుతున్నా కామ్‌గా ఉండిపోయారు. కానీ అజిత్ మాత్రం సరైన అడుగు వేశాడు. అభిమానం వెర్రితలలు వేసి, పెచ్చు మీరుతున్న ఇలాంటి తరుణంలో… మన హీరోలూ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోగలరా? `అభిమానులు సినిమాని సినిమాగానే చూడండి` అని స్టేజీమీద స్పీచులు దంచి కొట్టడం తప్ప.. ఎవరైనా వాళ్లని కంట్రోల్లో ఉంచడానికి ఇలాంటి సాహసోపేతమైన అడుగు వేశారా? అభిమాన సంఘాల్ని రద్దు చేసిన అజిత్.. మరోసారి అభిమానుల మనసుల్నిగెలుచుకున్నాడు. ఇక కంట్రోల్లో ఉండడం వాళ్ల బాధ్యత.