తమిళ హాస్యనటుడు వివేక్ కన్నుమూశారు. రెండు రోజుల కిందట.. వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్న ఆయనకు,… నిన్న తీవ్రమైన గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి.. ఎక్మో ద్వారా ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఫలించలేదు. ఈ ఉదయం కన్నుమూశారు. వివేక్.. తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర స్థాయి కమెడియన్గా చాలా కాలం రాణించారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
మాధవన్ హీరోగా వచ్చిన రన్ సినిమా వివేక్ చేసిన కామెడీ తమిళ ప్రేక్షకులనే కాదు.. తెలుగు వాళ్లనీ ఫిదా చేసింది. తెలుగులోకి డబ్ అయ్యే ప్రతి అగ్ర తమిళ హీరో చిత్రంలో వివేక్ తప్పనిసరిగా ఉండేవారు. ఆయన కామెడీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. రజనీకాంత్ శివాజీ సినిమా తర్వాత కొంత స్లో అయ్యారు. రెండు సినిమాల్లో హీరోగా చేశారు. హీరోగా చేస్తున్న వివేక్ కమెడియన్ క్యారెక్టర్లు చేయడన్న ప్రచారం జరగడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో… సంతానం కమెడియన్గా ఫామ్లోకి రావడంతో సినియర్గా స్లో అవ్వాల్సి వచ్చింది.
కొద్ది రోజుల క్రితం… ధనుష్ హీరోగా వచ్చిన రఘువరన్ బీటెక్లోనూ కనిపించారు. మళ్లీ సినిమాలు చేస్తూ ఫామ్లోకి వస్తున్నారని అనుకుంటున్న సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండె పోటు వచ్చింది. వివేకా నటనకు మెచ్చి ఎన్నో అవార్డులు లభించాయి. ఆయనకు 2009లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో బెస్ట్ కమెడియన్ అవార్డు ఐదు సార్లు దక్కించుకున్నారు. సామాజిక సేవల్లోనూ ఆయన ముందు ఉంటారు. అబ్దుల్ కలామ్ పిలుపు మేరకు గ్లోబల్ వార్మింగ్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. జ్యోతికతో పాటు వివేక్ కూడా ప్లాస్టిక్ ఫ్రీ తమిళనాడుకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.