ఏపీ సర్కార్ పై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అటు రాజకీయం, ఇటు సినిమా పరిశ్రమని ఓ కుదుపు కుదిపాయి. పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇస్తూ మంత్రులు, వైసీపీ నేతలు ఇప్పటికే భారీ ఎత్తున విమర్శల పర్వానికి దిగారు. ప్రస్తుతానికి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏకాకి గానే కనిపిస్తున్నారు. పవన్ కి మద్దతుగా సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ పెదవి విప్పడం లేదు. పైగా పవన్ తో మాకు సంబంధం లేదన్నట్లు ప్రకటనలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పవన్ కామెంట్స్ పూర్తిగా పర్శనల్. ఆయనతో పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తాజాగా ఇండస్ట్రీ నుంచి రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి పవన్ మేటర్ పై పెదవి విప్పారు. ఏపీ సర్కార్ ని సమర్ధిస్తూ .. పవన్ ని ఏకి పారేయడానికి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చాలా దారుణంగా విమర్శలు గుప్పించారు పోసాని.
”పవన్ కళ్యాణ్ కి అసలు విలువలే లేవు. అసలు హీరోకి ఉండాల్సిన లక్షణాలు లేవు. ఎవరి మాట వినడు. పవన్ కళ్యాణ్ కి తనని తాను ప్రేమించుకోవడం మాత్రమే వచ్చు. ఒక సినిమా వేడుకలో రాజకీయాలు మాట్లాడకూడదనే కనీస ఇంగితం లేదు పవన్ కళ్యాణ్ కి. జగన్ ని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కి లేదు. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద హీరో. కానీ పవన్ లూజ్ టంగ్ వల్ల మంత్రులతో తిట్లు తింటున్నారు. పవన్ కళ్యాణ్ అంత స్థాయి వున్న హీరోని ఒక మంత్రి ఎందుకు తిడతాడు ? పవన్ కళ్యాణ్ కి సిగ్గు అనిపించడం లేదా ? ఎందుకు అంత లూజ్ టంగ్. పవన్ కళ్యాణ్ కి నిజాయితీ ఉందా ? పవన్ రేమ్యునిరేషన్ విషయంలో అబద్ధం ఆడారు. పది కోట్లు అన్నారు. పవన్ కళ్యాణ్ రేమ్యునిరేషన్ 50కోట్లు. కాదని నిరూపించమనండి. పెద్ద హీరో అంటే పెద్ద మనసు వుండాలి. హీరోలు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్. వారి నటనలో పది శాతం కూడా పవన్ కి రాదు. వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ లా నిర్మాతలు, డిస్టిబ్యుటర్ వ్యవహారాల్లో తల దూర్చలేదు. సినిమాలు హిట్ ఐతే అడ్డగోలుగా డబ్బులు పెంచుకోలేదు. పవన్ కళ్యాణ్ ఒక్క విషయంపై కూడా సరిగ్గా నిలబడలేదు. అసలు పవన్ కళ్యాణ్ కి ప్రశ్నించడమే రాదు” అంటూ తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు పోసాని.
అంతేకాదు పవన్ కళ్యాణ్ వివిధ మీటింగుల్లో మాట్లాడిన వీడియో కంటింగులు ప్రెస్ మీట్ లో ప్లే చేసి పవన్ కళ్యాణ్ డబుల్ స్టాండ్ ఎలా వుంటుందో చూపించే ప్రయత్నం చేశారు పోసాని. మొత్తానికి పోసాని ప్రెస్ మీట్ చూస్తే పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి పెద్ద ఎత్తునే ప్రిపేర్ అయ్యారనిపిస్తుంది. పోసాని చేసిన విమర్శలు అయితే చాలా తీవ్రంగా వున్నాయి. మరి ఈ విమర్శలపై జనసేన నుంచి ఎవరైనా కౌంటర్ ఇస్తారేమో చూడాలి.