పవన్ కల్యాణ్‌ని అభిమానులంతా పవర్ స్టార్ అనిపిలుచుకొంటారు. పవర్ అంటే పవన్.. పవన్ అంటే పవర్ అన్నది అభిమానుల ఉద్దేశం. ఇంతకీ పవన్‌కి పవర్ స్టార్ అని నామకరణం చేసిందెవరో తెలుసా?? పోసాని కృష్ణమురళి అట. ఈ మాట ఆయనే చెప్పాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పోసాని పాల్గొన్నాడు. వేదికపై పోసాని మాట్లాడ్డానికి వచ్చేటప్పటికి జనంలో ‘పవర్ స్టార్. పవర్ స్టార్’ అనే నినాదాలు మిన్నంటాయి. ఇటీవల పవన్ గురించి పోసాని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ పోసానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారనిపించింది. అది గ్రహించిన పోసాని.. ”మీరంతా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు కదా, ఆ బిరుదు పవన్‌కి ఇచ్చింది నేనే. పవన్ తొలి హిట్ గోకులంలో సీత సినిమాకి నేనే మాటలు రాశా. ఈ సినిమా తరవాత పవన్ ని పవర్ స్టార్ అంటారని ఆ నాడే చెప్పా… అలా నా మాట నిజమైంది” అంటూ పవన్ అభిమానుల్ని శాంతింపచేయడానికి ట్రై చేశాడు.
ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంతో పోసాని భజన కార్యక్రమం కేటీఆర్ వైపు మళ్లింది. కేటీఆర్ వీరుడూ శూరుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే కేటీఆర్ మంత్రి అవ్వలేదు… ఆయన టాలెంట్ అలాంటిది అంటూ.. స్పీచ్ దంచికొట్టాడు. పోసాని స్పీచ్ ఇస్తున్నంతసేపూ కేటీఆర్ ‘నా గురించి వద్దు.. ఆపండి’ అంటూ చేతుల ద్వారా సంజ్ఞలు చేసి చూపించడం ఆకట్టుకొంది. అయితే అదేం పట్టించుకోకుండా పోసాని తన భజన కార్యక్రమం కంటిన్యూ చేయడం విశేషం. చరణ్ అందగాడని, చిరంజీవి కంటే గొప్పగా డాన్సులు, ఫైటింగులు చేస్తాడని కితాబిచ్చాడు. అంతలోనే ఇండియాలోనే బెస్ట్ డాన్సర్ బన్నీ, బెస్ట్ ఫిజిక్ కూడా తనదే అంటూ చరణ్ గాలి తీసే ప్రయత్నం కూడా చేశాడు. ఏంటో ఈ పోసాని.. ఎవ్వరికీ అర్థం కాడు.