జయ ప్రకాశ్ నారాయణ అంటే తెలియనివాళ్లుండరు. ఆయన్ని పార్టీలకు అతీతంగా అభిమానిస్తారు. కేవలం ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఉన్నత ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టారు. ఉన్నతమైన ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు. కుళ్లిపోయిన ఈ రాజకీయ వ్యవస్థని బాగు చేయాలని తపన పడ్డారు. జేపీ ఏ అంశంపై మాట్లాడినా, అందులోని 360 కోణాల్నీ తనదైన శైలిలో విశ్లేషిస్తుంటారు. ప్రపంచ రాజకీయ జ్ఞానం తెలిసిన వ్యక్తి. ముఖ్యంగా కుల వ్యవస్థ పోవాలని తన ప్రతి ప్రసంగంలోనూ చెబుతుంటారు. కులాన్ని చూసో, మతాన్ని చూసో ఓటేయొద్దు అని హచ్చరిస్తుంటారు. ఇలాంటి జేపీకి కూడా కులం అంటగట్టారు పోసాని కృష్ణమురళి. ‘ఫలానా కులం వాడు కాబట్టే.. అలా మాట్లాడుతున్నాడు’ అంటూ నిందలు వేయడానికి ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. జేపీకి సడన్‌గా కులం ముసుగు వేయడానికి కారణం.. ఆయన చంద్రబాబు నాయుడుని పొగడ్డమే. చంద్రబాబు గొప్ప విజనరీ అని, ఆయన భవిష్యత్తుని చూడగలడని చెప్పడమే.
చంద్రబాబుని ఎవరు పొగిడినా, పోసానికి శత్రువులే. ఎందుకంటే ఇప్పుడు పోసాని ఉన్నది వైకాపా పంచన. సినిమాల్లో అవకాశాలు మృగ్యమైన వేళ, కేవలం పవన్ కల్యాణ్‌ని బాగా తిడతాడన్న క్యాలిఫికేషన్తో ఏపీలో ఓ నామిటేటెడ్ పదవి దక్కించుకొని ఫలాల్ని ఎంజాయ్ చేస్తున్నారు పోసాని. ఏపీ చలన చిత్ర అభివృద్ది సంస్థ ఛైర్మన్‌గా పదవిని అనుభవిస్తున్న పోసాని, ఏనాడూ చిత్రసీమ గురించి, దాని అభివృద్ధి గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు జేపీని తిట్టడానికి ఓ ప్రెస్ మీట్ పెట్టేశారు. చంద్రబాబుదీ జేపీదీ ఒకే కులం కాబట్టి, తన సామాజిక వర్గానికి చెందిన నాయకుడ్ని వెనకేసుకువస్తున్నారని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు పోసాని. తన కులం వాడినే ప్రోత్సహించాలనో, మద్దతు తెలపాలనో జేపీ అనుకొంటే ఆయన ఆ పని ఎప్పుడో చేసేవాడు. తప్పు ఎక్కడున్నా నిలదీయడం జేపీ తత్వం. మంచితనం ఎక్కడున్నా మెచ్చుకోవడం కూడా ఆయన గుణమే. చంద్రబాబు విజనరీ గురించి హైటెక్ సిటీలోని ప్రతి అంగుళం చెబుతుంది. హైదరాబాద్ లోని ప్రతి విధీ మాట్లాడుతుంది. జేపీ కూడా అదే చెప్పారు. అందుకే ఆయన ఇప్పుడు వైకాపాకి, ముఖ్యంగా ఆ పంచన బతికేసే పోసాని మురళికీ శత్రువైపోయాడు.