చిరంజీవి మీద వైకాపాకు మళ్లీ కోపం వచ్చింది. మొన్నటికి మొన్న జనసేనకు రూ.5 కోట్లు ఇచ్చినందుకు చిరుని టార్గెట్ చేశారు. ఇప్పుడు `పిఠాపురంలో పవన్‌కు ఓటేయ్యండి` అన్నందుకు చిరుపై నోళ్లేసుకుని పడిపోతున్నారు. మెగా ఫ్యామిలీని తిట్టాలంటే.. ఎగేసుకొని వచ్చేసే పోసాని కృష్ణమురళికి ఇప్పుడు `చిరంజీవి` అనే టాపిక్ దొరికింది. `ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చాడు.. 18 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోలేక పార్టీని విలీనం చేసేశాడు.. డబ్బులకు ఎం.ఎల్.ఏలను అమ్ముకొన్నాడు` అంటూ ఇష్టానుసారంగా చిరంజీవిపై విరుచుకుపడిపోయాడు. చిరంజీవిని ఓ మాట అనేసి, తమ పనైపోయిందని సంబరపడిపోతున్నారే తప్ప, ఈ చేష్టలు వైకాపా పార్టీకే నష్టాన్ని కలగచేస్తాయన్న విషయాన్ని వాళ్లు గమనించలేకపోతున్నారు.
చిరు,పవన్‌కు మద్దతు ఇస్తే, గెలిపించాలని కోరితే.. దానికీ ప్రజారాజ్యానికీ సంబంధం ఏమిటి? అసలు చిరు మద్దతును రాజకీయ కోణంలోనే ఎందుకు చూడాలి? ఓ అన్నగా తమ్ముడు గెలవాలనుకోవడం చిరు తప్పా? ఏ అన్న అయినా అదే చేస్తాడు కదా? ఓహో.. వైకాపాలో అన్నలు, చెల్లెళ్లు, అమ్మలు.. అందరూ ఏ పుట్టగాకొడుగు కాబట్టి, అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి విభజన రేఖలు ఉండాలనా పోసాని ఉద్దేశం..? మొన్నటి వరకూ చిరంజీవి తటస్థంగా ఉన్నారు. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వలేదు. వైకాపాను సైతం ఆయన పల్లెత్తు మాట అనలేదు. అందుకే పోసాని లాంటి వాళ్లకు చిరు సౌమ్యుడుగా, మంచి వాడుగా కనిపించాడు. ఇప్పుడు తమ్ముడ్ని గెలిపించండి అనగానే చిరంజీవి కూడా శత్రువు అయిపోయాడు.
ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. వాళ్లకు ఏ ప్రెస్ మీట్ వెనుక ఎన్ని ఆంతర్యాలు ఉన్నాయో అర్థం అవుతున్నాయి. చిరంజీవి ఇప్పటికీ తటస్థంగానే ఉన్నారు. ఆయన ఏ పార్టీకీ మద్దతు తెలపడం లేదు. ఒకవేళ ఆయన జనసేన కండువా కప్పుకొన్నా, ఆపే దమ్ము, హక్కు ఎవరికీ లేవు. నేరుగా ఆయన రంగంలోకి దిగి తమ్ముడితో పాటు, కూటమిని గెలిపించాలని ప్రయత్నించినా అడ్డుకొనేవాడే లేడు. వైకాపా రెచ్చగొడుతున్న విధానం చూస్తుంటే, త్వరలోనే చిరు కూడా నేరుగా రంగంలోకి దిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో కూటమి హవా స్పష్టంగా కనిపిస్తోంది. సర్వేలూ అదే చెబుతున్నాయి. చిరు కూడా రంగంలోకి దిగితే వార్ వన్‌సైడ్ అవ్వుద్ది. అదే జరిగితే ఆ క్రెడిట్లో కొంత పోసాని లాంటి వాళ్లకూ దక్కుతుంది.