పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు బెయిల్ సాధించారు. చంద్రబాబు అమిత్ షా కాళ్లు మొక్కుతున్నట్లుగా మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి వాటిని మీడియాలో సర్క్యూలేట్ చేసిన పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఓ రోజు పోలీసు కస్టడీని కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఆ కస్టడీలో పలు విషయాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయనకు బెయిల్ మంజూరు అయింది.
అయితే ఆయన బయటకు వస్తారా లేదా అన్నదానిపై ఇంకా సస్పెన్స్ ఉంది. పోసానిపై లెక్కకు మిక్కిలిగా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎవరైనా పీటీ వారెంట్ తీసుకుని జైలు వద్దకు వస్తే వారితో పాటు వెళ్లాల్సిందే. అయితే చాలా కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. మరికొన్ని కేసుల్లో నోటీసులు జారీ చేయాలని హైకోర్టు చెప్పింది. గతంలో ఇలాగే విడుదల అవుతారు అనుకున్న సమయంలో సీఐడీ పీటీ వారెంట్ తో రావడంతో గుంటూరు జైల్లో ల్యాండవ్వాల్సి వచ్చింది.
సీబీఐ కోర్టులో పోసానిని హాజరు పరిచినప్పుడు రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఏడ్చారు. ఇప్పుడు వారం అయింది. బెయిల్ లభించింది. పోలీసులు ఇక చాల్లే అనుకుంటే ఆయనపై పీటీ వారెంట్లు వేయకపోవచ్చు. పీటీ వారెంట్ వేస్తే మాత్రం మరోసారి జడ్జి ముందు ఏడుపులంకించుకోవాల్సిందే. ఇప్పటికే ఓ సారి గుండెనొప్పి డ్రామాను ఆడి పోలీసులకు దొరికిపోయారు పోసాని.