ఒకరు రైతుల్ని దారుణంగా తిట్టడం.. మరొకరు ఆ రైతులకు క్షమాపణులు చెప్పాలని డిమాండ్ చేయడం. ఈ గేమ్.. వైసీపీలో ప్రారంభమయింది. ప్రస్తుతం ఫృధ్వీ వర్సెస్ వైసీపీ సీరియల్ నడిపేందుకు రంగం సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది. సొంత పార్టీ నేత ఫృధ్వీపై పోసాని కృష్ణమురళి.. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఫైరయ్యారు. దానికి కారణం రైతులపై.. ఫృధ్వీ అనుచిత వ్యాఖ్యలు చేయడమేనట. ఫృధ్వీ తక్షణం అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు అన్నాకా చొక్కా, ప్యాంట్లు వేసుకోకూడదా? సెల్‌ఫోన్లులల్లో మాట్లాడకూడదా? ఖరీదైన బట్టలు వేసుకోరూడదా? అని ప్రశ్నించారు. ఏ మాత్రం నైతికత, వెంకటేశ్వర స్వామిపై భక్తీ ఉన్న సరే వెంటనే అమరావతి రైతులకి, ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని, అప్పుడే ఆ దేవుడు క్షమిస్తాడని చెప్పుకొచ్చారు. ఫృధ్వీ మాటల వల్ల జగన్ ఇమేజ్ దెబ్బ తిన్నదని పోసాని ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమంగా ఆయన ఫృధ్వీ మాటలకు.. జగన్‌కు సంబంధం లేదన్నట్లుగా ఓ సర్టిఫికెట్ జారీ చేసే ప్రయత్నం చేశారు.
పోసాని కృష్ణమురళినే స్వయంగా బూతుల శాస్త్రవేత్త. ఎన్నికలకు ముందు ప్రెస్మీట్లలో ఆయన బూతులు తప్ప ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు, లోకేష్‌పై.. తనకు ఎంత కోపం ఉందో… అంతకు డబుల్ చేసి.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి… జగన్ అభిమానాన్ని పొందే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఆయనే… తాను తిట్లకు వ్యతిరేకం అన్నట్లుగా తెర ముందుకు వచ్చేశారు. ఇలా ఎందుకు వచ్చారన్నది చాలా మందికి ఆయన మాటలను బట్టే అర్థమైపోయింది. భూములు ఇచ్చిన రాజధాని రైతులకు.. ఫృధ్వీ మాట్లాడినవి మామూలు మాటలు కావు. కానీ.. మంత్రులే అలా మాట్లాడుతున్నారు. మహిళా రైతుల్ని కించ పరుస్తున్నారు. వారి మాటలపై ఒక్కరు కూడా.. వ్యతిరేక ప్రకటనలు చేయలేదు . కానీ ఫృధ్వీ విషయంలో మాత్రం పోసాని రంగంలోకి వచ్చేశారు.
మంత్రులు కానీ.. వైసీపీ నేతలు కానీ.. ఎవరూ.. పై నుంచి ఆదేశాలు రాకుండా.. బూతులు మాట్లాడరు. అమరావతి ఉద్యమకారుల్ని… రెచ్చగొట్టే ప్రక్రియలోనే ఇవన్నీ జరుగుతున్నాయనేది.. రాజకీయాల్లో ఓనమాలు ఉన్న వారందరికీ తెలుసు. రాజధాని ఉద్యమం ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఫృధ్వీ అసలు నోరు తెరవలేదు. కానీ ఆయన అలా మాట్లాడాలని వచ్చిన సూచనలతోనే మాట్లాడారు. ఇప్పుడు.. అది పూర్తి డ్యామేజ్ చేస్తుందని తెలిసిన తర్వాత పోసానిని రంగంలోకి తీసుకొచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే పార్టీలో ఒకరు రైతుల్ని తిట్టడం.. మరొకరు.. ఆ తిట్టిన వ్యక్తిని తిట్టడం.. ఓ డబుల్ గేమ్ అని.. ఎవరికైనా అర్థమవుతుందంటున్నారు.