సీఎంతో.. టాలీవుడ్ ప్రముఖుల సమావేశం ముగిసింది. `ఎండ్ కార్డ్ కాదు.. శుభం కార్డు పడుతుంది… అంతా మంచే జరుగుతుంది` అని చిరంజీవి ఎప్పటిలానే ఆశాజనకమైన సందేశాన్నిచ్చారు. అయితే.. సమావేశంలో ఏం జరిగిందో, ఏయే విషయాలు బయటకు వచ్చాయో.. ఎవ్వరికీ తెలీదు. ఇప్పట్లో చెప్పరు కూడా. అయితే ఈ సమావేశంలో పోసాని కృష్ణమురళి మాత్రం పెద్ద హీరోలపై పెద్ద ఎత్తున విరుచుకుపడినట్టు సమాచారం. హీరోలంతా.. పారితోషికాలు భారీగా పెంచేశారని, దాని వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, టికెట్ రేట్లు పెంచడం బదులుగా, పారితోషికాలు తగ్గించుకుంటే, అన్నీ సవ్యంగానే ఉంటాయని, హీరోల జల్సాల కోసం, సామాన్య ప్రేక్షకుడిపై భారం వేయడం తగదని, చిరు, మహేష్, ప్రభాస్ ల ముందే.. పోసాని ఆవేశంగా రెచ్చిపోయినట్టు టాక్. అయితే పోసాని మాట్లాడుతుండగానే.. జగన్ కల్పించుకుని `పక్కదారికి వెళ్లొద్దు` అంటూ కంట్రోల్ చేసినట్టు తెలుస్తోంది.
రోజూ నాలుగు ఆటలకు అదనంగా..5వ ఆటకి జగన్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అయితే.. టికెట్ రేట్ల విషయంలో ఇంకా ఓ స్పష్టమైన అవగాహనకు రావాల్సివుందని సమాచారం. అందుకోసం మరో మీటింగ్ అవసరం ఉండొచ్చని తెలుస్తోంది. ఈసారి మీటింగ్ లో ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రాతినిథ్యం లేదు. అందుకే… ఈసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిథులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం పది రోజుల్లో జీవో వస్తుందని అందరూ చెబుతున్నా, ఈ జీవో రావడం అంత తేలిక కాదని, ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.