సినీ నటుడు అలీలాగే తనకు కూడా ఓ పదవి ఇస్తారనడంలో వాస్తవం లేదని నటుడు పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. నిజంగా ఇస్తానని చెబితే చెప్పుకోవడానికే తనకేంటి సిగ్గని ఆయన మీడియాను ప్రశ్నించారు. పోసాని కృష్ణ మురళి కూడా కుటుంబంతో సహా సీఎం జగన్ను కలిశారు. అయితే తనకు పదవి ప్రకటించే ఉద్దేశంతో అపాయింట్మెంట్ ఇవ్వలేదని పోసాని మీడియాకు తెలిపారు. ఇటీవల తమ కుటుంబం కరోనా బారిన పడిందన్నారు.
ఆ సమయంలో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరామని .. ఈ విషయం తెలిసి సీఎం జగన్ ఆయన సతీమణి భారతి ఏఐజీ ఆస్పత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా సహకరించారన్నారు. వారి సహకారంతో తాము కరోనా నుంచి కోలుకున్నామని అందుకే సీఎం జగన్ను కుటుంబసమేతంగా కలిసి కృతజ్ఞతలు చెప్పామన్నారు. సినీ నటుడు అలీ కూడా కుటుంబంతో కలిసి సీఎం జగన్ ను కలిశారు.
అప్పుడే ఆయనకు గుడ్ న్యూస్ వస్తుందని జగన్ చెప్పారు.కానీ పోసానికి మాత్రం అలాంటి గుడ్ న్యూస్లు వస్తాయని జగన్ చెప్పలేదు. అందుకే… తనకే ఏ పదవి ఇవ్వడం లేదని.. ఇస్తామని చెబితే చెప్పుకోవడానికి సిగ్గెందుకని ప్రశ్నించారు. ఈ మాటల్లోనే ఆయన నిరాశకు గురయినట్లుగా కనిపిస్తోంది. కానీ ఆయన బయటపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైసీపీ కోసం అంత చేటుగా ఆయన నోరు చేసుకున్నారు.. వైసీపీ దాటితే ఆయన పరిస్ధితి దారుణంగా మారిపోతుంది.