టాలీవుడ్ కి జగనన్న తాయిలాల పథకం ప్రారంభమైంది. హాస్య నటుడు అలీకి ఓ పోస్టు గ్యారెంటీ అనిప్రచారం జరుగుతోంది. నిన్నా మొన్నటి వరకూ ఆయనకు రాజ్యసభ సీటు గ్యారెంటీ అన్నారు. ఇప్పుడు ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అంటున్నారు. రెండింటిలో ఒకటి మాత్రం ఖాయం. నిన్ననే.. అలీ దంపతులకు సీఎం కార్యాలయం నుంచి కబురొచ్చింది. అలీకి.. ఏ పదవి ఇచ్చారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకట్రెండు రోజుల్లో సీఎం కార్యాలయం నుంచే అధికారిక ప్రకటన వస్తుంది.
దాంతో పాటుగా పోసాని కృష్ణమురళికి సైతం.. ఓ పోస్టు గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. నిజానికి అలీ కంటే.. జగన్ ని ఎక్కువ మోసింది పోసానినే. అలీది ఒక రకమైన ప్రచారం అయితే, పోసానిది మరో రకం. ప్రత్యర్థుల్ని (ముఖ్యంగా పవన్ కల్యాణ్)ని తిట్లతో… దాడి చేయడం పోసాని స్పెషలైజేషన్. పవన్ -పోసానిల ఎపిసోడ్ ని ఎవరూ మర్చిపోరు. గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి.. పవన్ని వ్యక్తిగతంగా దూషించి వార్తలకెక్కారు. ఎంత డామేజీ చేయాలో అంతా చేశారు. అయితే.. దాని వల్ల నష్టపోయింది కూడా పోసానినే. ఎందుకంటే… ఆ తరవాత పోసానికి సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. పెద్ద చిత్రాలు పోసానిని దూరం పెట్టాయి. ఈ విషయాన్ని పోసానినే అంగీకరించాడు. జగన్ని నెత్తిమీద పెట్టుకునే పెపంలో.. పక్కవాళ్లపై బురద చల్లే విషయంలో అందరికంటే ముందున్న పోసాని.. ఆ రూపంలో నష్టపోయాడు కూడా. అందుకే పదవి ఇస్తే గిస్తే ముందు పోసానికే ఇవ్వాలన్నది అందరి మాట. మరి… జగనన్న ఏం తాయిలం ఇస్తాడో..?