వైసీపీ నేతల, సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ ప్రభుత్వం ఓ పదవి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ధియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని జీవోలో ప్రకటించారు. ఈ చైర్మన్ పదవి కింద నెలకు ఎన్ని లక్షల జీతం ఇస్తారో.. ఎన్ని లక్షలు అలవెన్స్‌లు ఇస్తారో.. వేరేగా జీవో ఇస్తారు. అది బయటకు రాకపోవచ్చు. కానీ నెలకు నాలుగైదు లక్షల వరకూ గిట్టుబాటవుతుందని ఇప్పటి వరకూ చైర్మన్లుగా పదవులు పొందిన వారికి ఇస్తున్న వాటిని బట్టి అంచనా వేసుకోవచ్చు. –
పోసాని కృష్ణమురళి వైసీపీ అధికార భాషకు చాంపియన్ లాంటి వారు. బూతులతో విరుచుకుపడతారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌తో పాటు పవన్ కల్యాణ్, మెగా ఫ్యామలీ అందర్నీ ఆయన అసభ్యంగా దూషించిన డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా కాలంగా వైఎస్ఆర్సీపీకి నమ్మకంగా పని చేస్తున్నప్పటికీ.. పదవి లభించలేదు. ప్రభుత్వం మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్తున్న సమయంలో ఇప్పుడు పదవులు ప్రకటిస్తున్నారు. కొద్ది రోజుల కిందట అలీకి సలహాదారు పదవి ఇచ్చారు. అలీ పదవితో పోలిస్తే పోసానిదే బెటర్ అన్న వాదన వినిపిస్తోంది.
వైఎస్ఆర్సీపీ కోసం టాలీవుడ్లో పని చేసిన వారందరికీ సీఎం జగన్ మూడున్నరేళ్ల తర్వాతైనా పదవులు ఇవ్వాలనుకుంటున్నారు. మొదట్లోనే ఫృధ్వీకి చాన్సిచ్చారు. అయితే వివాదాల కారణంగా పదవిని పోగొట్టుకున్నారు. తర్వాత తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారని ఆరోపిస్తూ.. పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన సీఎం జగన్‌తో పాటు వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్న పదవులు చూసైనా కొత్తగా ఎవరైనా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తారేమోనని వైసీపీ ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.