జగన్ దూరంగా చూస్తే బ్రహ్మపదార్థం – దగ్గరగా చూస్తే దేవుడి ప్రసాదం.. పొగడ్తల్లో రాటుదేలిపోయి..ఎంతో ఆలోచించి… సరిగ్గా గుడి ముంచు చెప్పాల్సిన డైలాగ్‌ను రైటర్ అద్భుతంగా రాశారని అనిపిస్తుంది కదా. మీ డౌటనుమానం నిజమే. ఇది రాసింది రచయితే.. చెప్పింది కూడా రచయితే. కాకపోతే సినిమాల్లో కాదు. రియల్‌గా. ఆ రచయిత పోసాని కృష్ణమురళి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపలికి వచ్చి ఆయన కాసేపు జగన్ స్తోత్రం చదివి వినిపించారు. అందులోనుంచి ఈ ప్రసాదం క్యాప్షన్ రాలి పడింది.
దూరంగా చూస్తే బ్రహ్మపదార్థమని ఎందుకనుకున్నారో కానీ.. ఆయన తీసుకుటున్న నిర్ణయాలు చేస్తున్న పరిపాలన పట్ల పోసానికి కాస్తంత అవగాహన ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దగ్గరగా చూస్తే దేవుడి ప్రసాదమని .. ఆయన ఏదో ఓ పదవి ఇస్తారని ఉద్దేశంతో అని ఉంటారని భావిస్తున్నారు. పోసాని కృష్ణమురళి జగన్ కోసం సినిమా ఇండ్ట్రీని కూడా శత్రువులుగా చేసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఇండస్ట్రీలో వేషాలు ఇచ్చే వారులేరు. అయినా తనకేం బాధలేదని చెబుతూ వస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఆయనకు జగన్ ఏదో ఓ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. రాకపోయినా పోసాని ఎలాంటి వ్యతిరేక మాటలు మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఒక్క వైసీపీకి కాకుండా అందరికీ వ్యక్తిగత శత్రువు అయ్యారు. అందరిపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నారు. ఇప్పుడు పదవి ఇవ్వలేదని జగన్‌పై అలాగే మాట్లాడితే.. ఎవరు సానుభూతి చూపే వారు కూడా ఉండరు. అందుకే పదవి రాకపోయినా అలా పొగుడుతూ ఉండాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది.