ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన వైకాపా తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరవాత ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించింది. ఇటీవల ఆయన హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ ఆ ఆపరేషన్ కాస్తా ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ జరిగిన చోట ఇన్ఫెక్షన్ వ్యాపించినట్టు సమాచారం. దాంతో పోసాని మరోసారి ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోసారి హెర్నియా ఆపరేషన్ జరిపినట్టు, ఒకట్రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వబోతున్నట్టు సన్నిహితులు తెలిపారు. నటుడిగా పోసాని బిజీ బిజీగా ఉంటున్నారు. ఆయనకు మంచి మంచి పాత్రలు దక్కుతున్నాయి. మరోవైపు రాజకీయాల వైపూ ఆయన మొగ్గు చూపిస్తున్నారు. ఇలాంటి సమయలో పోసాని ఆరోగ్యం క్షీణించడం బాధాకరమే. ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్లీ కెమెరా ముందుకు రావాలని కోరుకుందాం.