ఈమధ్య బోయపాటి శ్రీనుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు పోసాని కృష్ణమురళి. ముత్యాల సుబ్బయ్య దగ్గర సహాయకుడిగా పెట్టింది తనే అని, బోయపాటి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొన్నానని, అలాంటి తనని చూసి హేళనగా మాట్లాడాడని.. ఇలా ఏవేవో చెప్పుకొచ్చాడు పోసాని. దాంతో వీరిద్దరి మధ్య విబేధాలు బయటపడ్డాయి. పోసాని, బోయపాటి కుటుంబం మధ్య దగ్గరి చుట్టరికం ఉంది. బోయపాటిని సహాయ దర్శకుడిగా పెట్టింది కూడా పోసానినే. బోయపాటిని చాలా సందర్భాల్లో పోసాని ఆదుకొన్నాడు కూడా. అంత వరకూ… పోసాని చెబుతున్నవన్నీ నిజాలే. అయితే ఎవ్వరికీ తెలియని మరో నిజం ఒకటుంది. పోసాని కెరీర్‌కి బాటలు వేసింది, పోసానిని చెన్నై తీసుకొచ్చి ఆవాసం కల్పించింది మాత్రం బోయపాటి శ్రీను అన్నయ్య… బోయపాటి బ్రహ్మయ్య. పోసాని లేకపోతే బోయపాటి లేడన్నది ఎంత నిజమో… బోయపాటి బ్రహ్మయ్య లేకపోతే పోసాని లేడన్నది అంతే నిజమని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెవులు కొరుక్కొంటున్నాయి. పైగా బోయపాటి కూడా చాలా సందర్భాల్లో ‘నన్ను ముత్యాల సుబ్బయ్యకు పరిచయం చేసింది పోసానినే’ అని చెప్పాడు కూడా. కానీ పోసాని మాత్రం ఇప్పటి వరకూ బోయపాటి బ్రహ్మయ్య తనకు చేసిన సహాయం కోసం మాట్లాడలేదు.
పెద కాకాని నుంచి చెన్నై తీసుకొచ్చి, ఇక్కడ పోసానికి ఓ రూమ్ చూసి పెట్టి… అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు వెంట నిలిచింది.. నడిచింది బోయపాటి బ్రహ్మయ్య. కానీ… ఆ సంగతి పోసాని ఎందుకు మర్చిపోయాడో మరి. బోయపాటి శ్రీను దర్శకుడయ్యాక పోసానికి తన సినిమాల్లో అవకాశాలు ఇవ్వలేదన్నది నిజం. దానికి బోయపాటికి ఇతరత్రా కారణాలు ఉండొచ్చు. లేదంటే కావాలని దూరం పెట్టి ఉండవొచ్చు. ఆ కారణంతోనే.. పోసాని బోయపాటిపై గుర్రుగా ఉన్నాడని, తన కోపాన్నంతా ఇలా అప్పుడప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటాడని బోయపాటి సన్నిహితులు చెబుతున్నారు. అయితే పోసాని కామెంట్లపై బోయపాటి ఇప్పటి వరకూ స్పందించలేదు. ‘అవసరం వచ్చినప్పుడు బోయపాటి ఈ విషయం గురించి మాట్లాడి తీరతాడ’న్నది బోయపాటి సన్నిహిత వర్గాల మాట. మరి బోయపాటి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.