జగన్ రెడ్డి తనది కాదని చెప్పుకునే తన మీడియాకు చాలా చిక్కులు వస్తున్నాయి. తనతో ప్రెస్మీట్లు పెట్టించేది, స్క్రిప్టులు పంపేది సాక్షి మీడియానే అని పోసాని కృష్ణమురళి పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన ఓ మార్ఫింగ్ వ్యవహారంలో నమోదైన కేసుకు సంబంధించి సీఐడీ అధికారులకు ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఇపుడు సాక్షి తనకు పోసాని తెలుసు అంటుందా.. లేకపోతే అందరిలాగే ఆయన ప్రెస్మీట్లు కవర్ చేశాం తప్ప.. ఆయన చెప్పింది అబద్దమని..ఆయనెవరో తెలియదని అంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
సాక్షి మీడియా పనే – బహిరంగ రహస్యం
వైసీపీ నుంచి ఎవరైనా ప్రెస్మీట్ పెడితే .. అది సజ్జల ఆఫీసు నుంచి సమాచారం తో పెడితే సాక్షి మీడియాలో ఆయన మొదట గొంతు సవరించుకున్న దగ్గర నుంచి చివరికి ముగించి మంచి నీళ్లు తాగే వరకూ లైవ్ టెలికాస్ట్ చేస్తారు. పోసాని కృష్ణమురళికి ఉన్న ఫేస్ వాల్యూకు..ఆయనకు ఉన్న రాజకీయ ప్రాధాన్యతకు ఏ టీవీ చానల్ అయినా రెండు నిమిషాలు లైవ్ ఇస్తే గొప్ప.కానీ సాక్షి మాత్రం మొత్తం చూపిస్తుంది. ఎందుకంటే.. ఆయన ఎలాంటి తిట్లు తిట్టాలో.. ఎలాంటి ఎఫెక్ట్ తీసుకు రావాలో వారు చెప్పి ఉంటారు కాబట్టి మొత్తం చూపిస్తారు. ఇదంతా బహిరంగరహస్యం. సాక్షి ఈ టెలికాస్ట్ ఫ్రీ సిగ్నల్ కూడా ఇతరులకు ఇస్తుంది.
మార్ఫింగ్ ఫోటోలు షేర్ చేసింది కూడా సాక్షినేనని పోసాని వాంగ్మూలం
ఓ సందర్భంలో చంద్రబాబు గురించి అభ్యంతరకర ఫోటోలను చూపించి పోసాని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అవి ఫేక్ ఫోటోలు. మార్ఫింగ్లు చేసి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులు అడిగితే.. అవి సాక్షి నుంచి వచ్చాయని అందుకే వెరిఫై చేసుకోకుండా మాట్లాడేశానని చెప్పారు. అంటే ఫేక్ ఫోటోలను.. మార్ఫింగ్లను సాక్షి ఆఫీసులోనే తయారు చేసి.. పోసాని లాంటి వాళ్లకు పంపి తిట్టిస్తున్నారన్నమాట.
సాక్షికి సీఐడీ నోటీసులు ?
పోసాని వాంగ్మూలం ఆధారంగా సాక్షి మీడియాకు సీఐడీ నోటీసులు జారీ చేయనుంది. సాక్షి ఎడిటర్ కు ఈ నోటీసులు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పోసానికి మార్ఫింగ్ ఫోటోలు పంపిందెవరు.. వాటిని ఎక్కడ సిద్ధం చేశారు.. వంటి వాటితో పాటు దాని వెనుక ఉన్న కుట్రను బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ అసలు విషయం వేరుగా ఉంది. పోసాని ఎవరో తమకు తెలియదని.. ఆయన ప్రెస్ మీట్లు ఇతర ఈవెంట్లలాగే కవర్ చేశామని చెబితే మాత్రం.. పోసానిని రోడ్డున పడేసినట్లే అనుకోవచ్చు.