నటుడు, రచయిత, దర్శకుడు అయిన పోసాని కృష్ణమురళి ఎప్పటినుండో వైఎస్ఆర్సిపి కి మద్దతు ఇస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా నిలబడి పోటీ చేసి ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటు తెలంగాణలో కేసీఆర్ అటు ఆంధ్రప్రదేశ్ లో జగన్, కేంద్రంలో మోడీ ముగ్గురు కూడా చంద్రబాబు మీద పగ పట్టినట్లుగా ప్రవర్తిస్తుండడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు బిజెపిలోకి ఫిరాయించడం, త్వరలోనే ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించి తీరతారని వార్తలు వస్తుండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులలో నిరుత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ చేతికి పగ్గాలు ఇస్తే తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని చెబుతూ వస్తున్నారు. ఈ వాదనతో విభేదించేవారు సైతం జూనియర్ ఎన్టీఆర్ శక్తిసామర్థ్యాల మీద నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు, లోకేష్ తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పార్టీని మరింత చక్కగా నడపగలరని వారు అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ని స్పందించమని కోరగా ఆయన, తెలుగుదేశం పార్టీని పైకి లేపడం జూనియర్ ఎన్టీఆర్ వల్ల కూడా కాదని తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ లో అద్భుతాలు ఏమీ జరగవని పోసాని అభిప్రాయపడ్డారు. అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్ ఒకరికి మాత్రమే కాదని సినిమా హీరోలు అందరికీ వర్తిస్తుందని, సినిమా హీరో లను ప్రజలు నమ్మే రోజులు పోయాయని పోసాని వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ వల్ల కూడా తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవం పొందుకో లేదని చెప్పడం ద్వారా పోసాని, వైఎస్ఆర్సిపి పార్టీ పట్ల తన విధేయతను చాటుకున్నారని చెప్పవచ్చు.