పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి “పవన్ నీకెంత మంది భార్యలు.. ఎంత మందిని మోసం చేశావు” అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలను టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ప్రెస్ క్లబ్ వద్దకు పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ వచ్చారు. పోసాని సంగతి చూస్తామంటూ హెచ్చరికలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.
తన భార్యపై ఎవరో పోస్టులు పెట్టారంటూ పోసాని ఎమోషనల్ అయ్యారు. దానికి పవన్ కల్యాణ్‌ను నిందించారు. తన భార్యంటే తనకు ప్రాణమని.. ఆమె తనకు భార్య మాత్రమే కాదు ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. ఆమె చనిపోయిన రోజే తాను చనిపోతానని ప్రకటించారు. గతంలో పోసాని భార్యతో ఆయనకు విబేధాలు ఉండేవని.. ఆమె ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసిందని.. ఇలా పలు రకాలుగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇవి ఆయన చదివి ఆవేశం తెచ్చుకుని ప్రెస్‌క్లబ్ లో సమావేశం పెట్టారు.
సమావేశం ముగిసిన తర్వాత కూడా ప్రెస్ క్లబ్ బయట పెద్ద ఎత్తున పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఉండటంతో పోసానిని సొంతకారులో వెళ్లవద్దని పోలీసులు సూచించారు. తమ కారులోనే ఇంటి దగ్గర దిగబెట్టాలని నిర్ణయించారు. ఆయనకు భద్రత కల్పించి క్షేమంగా కారులో కూర్చుబెట్టి ఇంటి వైపు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి .. తనకు ఏమైనా అయితే పవన్ కల్యాణ్‌దే బాధ్యత అని ప్రకటించారు. తాను పవన్ కల్యాణ్‌పై కేసు పెడతానని హెచ్చరించారు. పవన్‌పై పోసాని ఎటాక్‌తో ఈ వివాదం మరింత ముదురుతోంది.