పోసాని కృష్ణ మురళిని రాజంపేట సబ్ జైలు నుంచి నరసరావుపేట కు తరలిస్తున్నారు. అక్కడ కూడా కేసులు నమోదు కావడంతో పీటీ వారెంట్ మీద ఆయనను తరలిస్తున్నారు. మధ్యాహ్నం నరసరావుపేట కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించనున్నారు. పోసాని కృష్ణమురళిపై పదిహేడుకుపైగా కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా కేసులు ఉన్నాయి. కోర్టు ఆదేశాలతో నమోదైన కేసులు కూడా ఉన్నాయి. వాటి విషయంలోనూ పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తనకు పీటీ వారెంట్లు అమలు చేయకుండా పోసాని అనారోగ్యం డ్రామాలు ఆడే ప్రయత్నాలు చేశారు. కడుపునొప్పి, గుండె నొప్పి అని డ్రామాలు ఆడటంతో పోలీసులు అన్ని పరీక్షలు నిర్వహించారు. ఏ అనారోగ్యం లేదని తేలడంతో మళ్లీ జైలుకు పంపించారు. ఈ డ్రామాలతో పోసాని పరువు రోడ్డున పడింది. ఎంత గింజుకున్నా.. ఆయనకు ఇప్పుడల్లా బెయిల్ వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. పలు కేసులు పెండింగ్ లో ఉండటమే కారణం.
మరో వైపు రాజంపేటలో పోసాని ఇచ్చిన వాంగ్మూలం మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డిని అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వారిద్దరూ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే కేసులు నమోదు చేయకుండా ముందస్తు బెయిల్ ను కోర్టులు ఇచ్చే అవకాశం లేదు. ఈ పిటిషన్లపై విచారణ ఎప్పుడు జరుగుతుందన్నది తేలాల్సి ఉంది.