పోసాని కృష్ణమురళి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం చెప్పుదెబ్బలు తింటారట..! ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు. కొంత కాలంగా… వైసీపీకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్న ఆయన.. ఈ సారి నేరుగా పాదయాత్రలో జగన్‌తో కలసి పాల్గొన్నారు. ఆ తర్వాత జగన్ మీడియా ముందటే తన తన్మయత్వాన్ని ప్రదర్శించారు. “ప్లీజ్..ఒకే ఒక్క చాన్స్ ” జగన్‌కు ఇవ్వండి.. ఆ తర్వాత ఇవ్వడానికేమీ లేకుండా చేస్తారన్నట్లుగా చెప్పుకొచ్చారు. పిల్లికి ఎలక సాక్ష్యంలాగా.. సీఎం అవడానికి జగన్ అన్నీ అర్హతలు ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చేశారు. దాన్ని జగన్ మీడియా గొప్పగా ప్రకటించేసుకుంది.
ప్రజారాజ్యం పార్టీ తరపున ఓ సారి చిలకలూరి పేట నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన పోసాని కృష్ణమురళికి రాజకీయ ఆశలు బాగానే ఉన్నాయి. టీడీపీ లాంటి పార్టీల్లో.. సామాజివర్గ పరంగా చూస్తే ఎక్కువ అవకాశాలు దొరకవనుకుంటారమో కానీ… ఆ పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసి.. ఇతర పార్టీల్లో ఫ్యాన్స్‌ను సంపాదిస్తూంటారు. ఆయన ఎప్పటికప్పుడు తనకు పోటీ చేయడం ఇష్టం లేదని చెబుతూంటారు. అయినా రాజకీయాలు మాత్రం చేస్తూంటారు. వైసీపీని మోసేస్తూంటారు.
అయినా ఇప్పుడు జగన్‌ను అంత అత్యవసరంగా మోయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో… పోసానికో ఏరుక..! ” జగన్ రెడ్డి నేను కమ్మ నాకు ఆ కులపిచ్చి లేదు. మేం క్లాస్మేట్స్ కాదు. మా ఇద్దరిది ఒక జిల్లా కాదు. కేవలం ఆయన కార్యదక్షత నాకు నచ్చింది. దైవసాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా, నాపై ఒట్టుపెట్టుకుని చెబుతున్నా. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన్ని నమ్మి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ” ఇదీ ఆయన చెప్పుకొచ్చిన వరుస. ఇక కాళ్లు పట్టుకోవడం ఒక్కటే. ఎన్నికల ముందుకొస్తే.. అదీ కూడా చేసేస్తా అన్నట్లు ఉన్నారు పోసాని. మరీ ఇంత దిగజారుడెందుకో..!