ఇటీవల నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్యం క్షీణించినట్టు, ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వార్తలొచ్చాయి. ఆయనకు ఓ ఆపరేషన్ ఫెయిల్ అయితే, మరో ఆపరేషన్ కూడా చేసినట్టు చెప్పుకున్నారు. వీటిపై పోసాని స్పందిస్తూ ఓ వీడియో బైట్ విడుదల చేశారు. తాను అనారోగ్యం పాలైన విషయం నిజమే అని, డాక్టర్లు తన ప్రాణాల్ని కాపాడారని, ఇప్పుడు సంపూర్ణంగా కోలుకున్నానని ఆ వీడియోలో చెప్పారు. అంతేకాదు.. వారం పది రోజుల్లో తాను మళ్లీ షూటింగులలో కూడా పాల్గొనడానికి రెడీ అవుతున్నానని చెప్పుకొచ్చారు.
”కొన్నాళ్లుగా ఆ ఆరోగ్యం బాలేదని, విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. నిజమే.. నాకు అనారోగ్యం వచ్చింది. కానీ చచ్చిపోయేంతగా కాదు. యశోదలో చేరాను. డా.ఎంవీ రావుగారు నన్ను బతికించారు. పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడ్ని చేశారు. నా ఆరోగ్యం గురించి ఎలాంటి ఆలోచనలూ వద్దు. ఇన్నాళ్లు నా ఆరోగ్యం గురించి కంగారు పడ్డవాళ్లకు, నేను బాగుండాలని పూజించిన వాళ్లకు శతదా కృతజ్ఞతలు” అని ఆ వీడియోలో పేర్కొన్నారు.