విశాఖ స్టీల్ ప్లాంట్ను పోస్కోకు కట్టబెట్టే కుట్ర జరిగిందని ఆరోపిస్తున్న విపక్షాలకు షాక్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో కార్మిక సంఘాల నేతలకు చెప్పినట్లుగా పోస్కో ప్లాంట్ను ఏపీలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ మేరకు చర్చలకు రావాలని పోస్కోకు ఏపీ సర్కార్ ఆహ్వానం పంపింది. కొరియా నుంచి ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కోరుతూ పరిశ్రమల శాఖ పోస్కో ఇండియా సీఎండీ సంగ్ లేకి లేఖ రాశారు. ఏపీకి వస్తే పరిశ్రమ ఏర్పాటు విధివిధానాలపై చర్చిద్దామని అందులో కోరారు.
పోస్కో విశాఖలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుందని ఒప్పందం చేసుకుందని… కొన్ని పత్రాలు బయటకు వచ్చాయి. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ తరుణంలో వారి విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వం.. పోస్కోతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పోస్కో బృందం ఇప్పటికే కృష్ణపట్నం వచ్చి పోర్టు అధికారులతో చర్చలు జరపిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో కృష్ణపట్నం వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది కాబట్టి.. ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన పోర్టు పక్కనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం ఎగుమతులు, దిగుమతులకు ఎంతగానో దోహదం చేస్తుందని ప్రభుత్వం పోస్కోకి చెబుతోంది. పోస్కో వచ్చి ఒప్పందం కుదుర్చుకుంటే వెంటనే భూమి అప్పగించేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది.
పోస్కో సంస్థ కృష్ణపట్నంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. అది ఏపీ సర్కార్ సాధించిన అతి పెద్ద విజయంగా మారుతుంది. పెట్టుబడులు రావడం లేదని అంటున్న విపక్షాలకు… విశాఖ స్టీల్ ప్లాంట్ను పోస్కోకు కట్ట బెట్టే ప్రయత్నం చేస్తున్న విమర్శలకు ఒక్క సారే కౌంటర్ ఇచ్చినట్లు అవుతుంది. దీనిపై ప్రభుత్వం సీరియస్గా వర్కవుట్ చేస్తోంది.అయితే స్టీల్ ప్లాంట్ పెట్టడం అంతతేలికనా అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ప్రభుత్వం పట్టుదలగా ఉందికాబట్టి… పోస్కో ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.