ఏపీలో కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం అయ్యింది. శుక్రవారం ఉదయం 9.46గంటలకు అసెంబ్లీ సెషన్ మొదలవుతుంది. సభా నాయకుడిగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తారు. తర్వాత ఇతర సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది.
అయితే, ఈసారి సభలో మెజారిటీ పార్టీగా టీడీపీ నేతలే ఉన్నారు. ఆ తర్వాత జనసేనకు బలం ఉండగా మూడో పార్టీగా వైసీపీ ఉంది. కేవలం 11సీట్లతో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సో… వైసీపీకి, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత హోదా కూడా లేని మాజీ సీఎం జగన్ కు ప్రత్యేకంగా సీటేమి ఉండదు. అందరు సభ్యుల్లాగా తనను పిలిచినప్పుడు వెళ్లి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సభా మర్యాదల ప్రకారం ప్రొటెం స్పీకర్ గా ఉండనున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నమస్కారం చేసి రావాల్సి ఉంటుంది.
జగన్ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుండి జగన్ పులివెందుల నియోజకవర్గం నుండి గెలుస్తూ వస్తున్నారు. దీంతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యేకు ఏ ప్రాతిపాదికన అసెంబ్లీలో సీటు కేటాయిస్తారో… జగన్ కు కూడా అదే ప్రాతిపాదికన సీటు కేటాయించబోతున్నారు.
అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో కొత్తవారు చాలానే ఉన్నప్పటికీ, సీనియర్ల సంఖ్య కూడా ఎక్కువే. మంత్రిపదవి రాకుండా సీనియర్ ఎమ్మెల్యేలుగా చాలా మంది ఉన్నారు. అంటే వారి తర్వాతే జగన్ కు సీటు ఉంటుంది. అంటే ఎక్కడో ఒకచోట అందరిలో ఒక్కడిగా ఉండాల్సిందే.
అయితే, అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసేందుకు జగన్ సభకు వస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో జగన్ ఫ్రెండ్ కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయలేదు. కేసీఆర్ గాయపడటంతో తర్వాత అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఓత్ తీసుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా కేసీఆర ను ఫాలో అయిపోయి, సెషన్ ముగిశాక ఓ రోజు స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేస్తారా… లేదా ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి, అసెంబ్లీకి వచ్చి అందరితో పాటే ప్రమాణస్వీకారం చేస్తారో చూడాలి.