శ్రావణి అనే అమ్మాయి మర్డర్ మిస్టరీ రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు దర్యాప్తు క్రమంలో మరిన్ని సంచలనాత్మక విషయాలు బయట పడుతున్నాయి. ఏ బావి లో అయితే శ్రావణి మృతదేహం లభించిందో, అదే బావిలో మనీషా అనే మరొక అమ్మాయి మృతదేహం లభించడం విస్మయానికి గురిచేస్తోంది. యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగానే ఉందా అన్న చర్చ ప్రజలలో (మీడియాలో కాదు) కలిగేలా చేస్తోంది.
అయితే నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పన అనే అమ్మాయి కూడా ఇదే తరహాలో హత్య గావించబడి ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన కొంతమంది యువకులు ఈ దారుణాలు గత కొద్ది రోజులుగా చేస్తున్నట్టుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఇన్ని దారుణాలు తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది.. అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ కి భయపడి మీడియా తెలంగాణ రాష్ట్ర శాంతిభద్రతల గురించి చర్చ పెట్టే ధైర్యం చేయడం లేదని, నిజంగా తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి గురించి మీడియా చర్చ పెట్టినట్లయితే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయి అని ప్రజలు భావిస్తున్నారు.
అయితే ప్రతిపక్షంలో ఒక్కరు కూడా మిగలకుండా కేసీఆర్ అందరినీ లాక్కోవడం వల్ల కూడా ఇలాంటి శాంతిభద్రతల సమస్య గురించి ప్రశ్నించే గళం రాష్ట్రంలో లేకుండా పోయిందని పలువురు భావిస్తున్నారు. ప్రజలు చచ్చిపోయినా, శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నా ఎవరు తనని ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, మరొక పక్క మీడియాను బెదిరిస్తూ రాజకీయం చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని విశ్లేషకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.