హైదరాబాద్: విజయవాడ నగరంలో ఇవాళ ఎక్కడ చూసినా లగడపాటి ఫ్లెక్సీలపైనే చర్చ. ఇవాళ లగడపాటి జన్మదినం సందర్భంగా నిన్న ఆయన అభిమానులు కొందరు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు. రాజగోపాల్ సన్నిహితుల పేరున వెలసిన ఆ ఫ్లెక్సీలలో బీజేపీ నేతల ఫోటోలతో పాటు కొన్నిచోట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. దీనితో ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఇదిలా ఉంటే ఇవాళ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా లగడపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద ఫ్లెక్సీలు పెట్టారు. అయితే దానిలో విషయం మాత్రం పూర్తిగా లగడపాటికి చురకలు అంటించేవిధంగా వ్యంగ్యంగా ఉంది. “75 వేల కోట్ల రూపాయలను బ్యాంకులనుంచి రుణాలుగా తీసుకుని బ్యాంకులను ముంచి కుటుంబం పేరుమీద విదేశాలలో అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్న లగడపాటి రాజగోపాల్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా మరెన్నో వేల కోట్ల రూపాయలను కూడబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అభిమానులు” అని రాసి ఉంది. మధ్యలో ‘చాలవు-ఇంకా కావాలి’ అనే క్యాప్షన్ కూడా రాసి ఉంది. ఈ ఫ్లెక్సీలను చూసిన లగడపాటి అభిమానులు ఆందోళనకు దిగారు… తమ నేతకు వ్యతిరేకంగా ఉన్న ఆ ఫ్లెక్సీలను చించేశారు.