పెద్ద నోట్లను రద్దు చేస్తే రాజకీయంగా ఎదురు దెబ్బ తప్పదా? పెద్ద నోట్ల రద్దు అనే ప్రతిపాదన కొత్తది కాదు. 1971లోనే ఇందిరా గాంధీకి వాంగ్ చూ నివేదిక ఈ మేరకు సిఫార్సు చేసింది. 5 వేలు, 10 వేల నోట్లను రద్దు చేయాలని సూచించింది. కానీ ఇందిర ఆ పని చేయలేదు. కారణం, అలా చేస్తే ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని భయపడ్డారు. తన పార్టీ నాయకులతో స్వయంగా ఆమే ఈ సంగతి చెప్పారు.
45 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అది వేరే విషయం. ఇలాంటి నిర్ణయం రాజకీయంగా నష్టం కలిగిస్తుందనే ఇందిర భయం తప్పా అనే అంశమే ఇప్పుడు పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నిర్ణయం వల్ల తన పార్టీకి ఓట్లు రాకపోయినా పరవాలేదని మోడీ ప్రకటించారు. అయితే వాస్తవ పరిస్థితులను చూస్తే, ఓట్ల పరంగానూ ఈ నిర్ణయం నష్టం చేసే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
ఈ నిర్ణయం తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ మంచి విజయాలను సాధించింది. మహారాష్ట్ర, గుజరాత్, చండీగఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాలను సొంతం చేసుకుంది. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ కమలం వికసిస్తుందని అనేక సర్వేలు అంచనా వేస్తున్నాయి.
యూపీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఇండియా టుడే మొన్నటి సర్వే అంచనా వేసింది. ఉత్తరాఖండ్ లోనూ కమలం వికసిస్తుందని ఏబీపీ తాజా సర్వే లెక్కగట్టింది. పంజాబ్ లోనూ కాషాయ కూటమి అత్యధిక సీట్లు గెలుస్తుందని కూడా ఆ సర్వే అంచనా వేసింది.
ఆశ్చర్యకరంగా మణిపూర్ లోనూ బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని గత అక్టోబర్లో ఏబీపీ సర్వే అంచనా వేసింది. బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో మరోసారి కమలం వికసిస్తుందని కూడా ఆనాటి సర్వే తేల్చింది. ఇవన్నీ అంచనాలు మాత్రమే. అది నిజం. అయితే, ఈస్థాయిలో బీజేపీ విజయాలను సాధిస్తుందన్న అంచనాలు కూడా సంచలనమే. ఐదు రాష్ట్రాల్లోనూ కాషాయదళం క్లీన్ స్వీప్ చేస్తే అది మామూలు విషయం కాదు. ఎస్పీ అధికారంలో ఉన్న యూపీ, కాంగ్రెస్ చేతిలో ఉన్న ఉత్తరాఖండ్, మణిపూర్ లను బీజేపీ కైవసం చేసుకుంటే మోడీ ఖ్యాతి మరింత పెరుగుతుంది.
ఒకవేళ ఈ సర్వే అంచనాలేనిజమైతే, పెద్దనోట్ల రద్దు బీజేపీకి పెద్ద మేలు చేసిట్టవుతుంది. యూపీ, మణిపూర్లో బీజేపీ గెలిస్తే అద్భుతమే. ఆ అద్భుతం జరుగుతుందో, సీన్ రివర్స్ అవుతుందో వేచి చూద్దాం.