గతేడాది సంక్రాంతి బరిలో నిలిచి సర్ప్రైజ్ ఇచ్చాడు శర్వానంద్. బాలయ్య, ఎన్టీఆర్, నాగార్జున సినిమాలు బరిలో ఉన్నా… ఏమాత్రం భయపడకుండా ఎక్స్ప్రెస్ రాజా విడుదల చేసి హిట్ కొట్టాడు. సరిగ్గా అలాంటి ఫీట్ ఈ యేడాదీ రిపీట్ చేయడానికి రెడీ అయ్యాడు శర్వా. తాను నటించిన శతమానం భవతి ఈ సంక్రాంతికి విడుదల అవుతోంది. ఈ రెండు పెద్ద సినిమాలతో పోటీ పడడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందరి దృష్టి చిరు, బాలయ్యల సినిమాలపైనే ఉంది. వాటి గురించే మాట్లాడుకొంటున్నారు. శతమానం భవతి ఊసే ఎక్కడా లేదు. దానికి తోడు ఎప్పుడూ పబ్లిసిటీతో హోరెత్తించే దిల్రాజు ఇంకా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్లు ప్రారంభించలేదు. పైగా ఇటీవల విడుదలైన ట్రైలర్ ఏమాత్రం ఎగ్జయిట్మెంట్ని ఇవ్వడం లేదు.
కాకపోతే ఈసినిమా సెన్సార్ రిపోర్ట్, లాబ్ రిపోర్ట్ అద్భుతంగా ఉన్నాయి. మరోసారి దిల్ రాజు బ్యానర్ నుంచి ఇంటిల్లిపాదీ చూసేలా ఓ సినిమా వచ్చిందన్నది టాక్. ఫ్యామిలీ ఎమోషన్స్, చక్కటి సంగీతం, అద్భుతమైన పల్లె వాతావరణం.. ఇవన్నీ కలబోతగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. జనాలంతా పెద్ద సినిమాల హడావుడిలో ఉన్నా.. శర్వా సినిమా సడన్ సర్ ప్రయిజింగ్గా ఉండబోతోందని, కచ్చితంగా సంక్రాంతి రేసులో నిలవగల దమ్ము ఈ సినిమాకి ఉందని, కాకపోతే… మౌత్ టాక్ ఈ సినిమాకి కలిసిరావాలని, పెద్ద సినిమాల హడావుడి తగ్గాక గానీ.. ఈసినిమా జోరు మొదలవ్వదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 14న విడుదల చేయడం ఈ సినిమాకి కలిసొచ్చేదే. ఎందుకంటే 11న ఖైదీ వస్తోంది. 12న బాలయ్య సినిమా విడుదల కాబోతోంది. వాటి హడావుడి తగ్గడానికి రెండు మూడు రోజులు చాలు. అందుకే దిల్ రాజు పక్కా ప్లాన్ ప్రకారమే తన సినిమాని విడుదల చేస్తున్నాడని, గతేడాది లాగే శర్వా ఈ యేడాదీ షాక్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.