తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని నాని సోషల్ మీడియాలో ప్రజా వేదిక కూల్చడం గురించి స్పందిస్తూ వేసిన పోస్ట్ కు నెటిజన్ల నుంచి, ఆ పోస్ట్ మీడియా లో ప్రసారం అయిన తర్వాత చూసిన జనాల నుంచి పాజిటివ్ స్పందన వస్తోంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు హయాంలో కట్టిన ప్రజావేదిక కూల్చడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కట్టడం నది పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి, అనుమతులను ఉల్లంఘించి కట్టబడింది కాబట్టి దీన్ని కూల్చివేయాలనే నిర్ణయం సరైనదే అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు సమర్థించుకున్నారు. అయితే దీనిపై వ్యంగ్యంగా స్పందించారు ఎంపీ కేసినేని నాని. కేశినేని నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..
“ఇంకా నయం…తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా లోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది…అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే……..” అంటూ నర్మగర్భ మైన పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్, నదీ పరివాహక ప్రాంతంలో ఉందన్న కారణంతో తాజ్ మహల్ లాంటి భవనాన్ని కూడా కూల్చివేసి ఉండేవాడని కేసినేని నాని అభిప్రాయం. వైఎస్ఆర్సిపి అభిమానులు కూడా జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించ లేక సతమత మవుతున్నారు. నది పరివాహక ప్రాంతం అన్న కారణంతో ఈ కట్టడాన్ని కూల్చివేస్తున్నట్లయితే, అక్కడే ఉన్న ఇతర భవనాలు అన్నింటిని ఇదే చిత్తశుద్ధితో కూల్చి వేస్తారా, ప్రత్యేకించి అక్కడ ఉన్న బిజెపి బడా నేతల కట్టడాల జోలికి వెళ్లే దమ్ము ధైర్యం జగన్ కి ఉన్నాయా అంటూ విపక్ష పార్టీల అభిమానులు విసురుతున్న ప్రశ్నలకు వైఎస్ఆర్సిపి అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నేతలు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు.
ఏది ఏమైనా ప్రజల ధనం తో నిర్మించిన కట్టడాన్ని కూల్చివేసి మళ్లీ ప్రజాధనంతో కట్టడాన్ని నిర్మించ తలపెట్టిన జగన్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
Kesineni Nani satire on social media wrt to Praja Vedika demolition pic.twitter.com/neA7uJYIet
— Telugu360 (@Telugu360) June 27, 2019