2019 నాటికి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాల కల్పనే తన లక్ష్యం అని అన్నారు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్. మండలిలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ఐటీ రంగం అభవృద్ధికి టీడీపీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా రాష్ట్రంలో ఐటీ టవర్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. విశాఖలో భవనాలు నిర్మించే చర్యలు మొదలు పెట్టామని మంత్రి చెప్పారు. ఏపీ ఐటీ మంత్రి సభలో చేసిన ప్రకటన ఇది.
ఇదేమీ కొత్తగా చెప్పిన విషయం కాదు. లక్ష ఉద్యోగాల కల్పన కోసం కొత్తగా ప్రకటించిన విధానమూ కాదిది. ఇంకా చెప్పాలంటే చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తున్నారు అనాలి. గత ఏడాది డిసెంబర్ లో కూడా ఉద్యోగాల కల్పనపై ఇలాంటి ప్రకటనే నారా లోకేష్ చేశారు. ఐటీ రంగంలో 2019 నాటికి లక్ష ఉద్యోగాల కల్పన అనేది ఆయన మంత్రి అయిన దగ్గర నుంచీ చెబుతున్న మాటే. ఆ మధ్య ఒక కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గడచిన రెండు నెలల వ్యవధిలో 30 కంపెనీలు తెచ్చి, 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని ప్రకటించారు. అంటే, సగటున ఒక్కో కంపెనీలో వంద మందికి ఉద్యోగాలు వచ్చినట్టు లెక్క. ఆ తరువాత, ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాలు నియామకాలు జరిగినట్టు ఇంతవరకూ ప్రకటించనే లేదు. అన్నీ ఒప్పందాల దశలో ఉన్నాయనీ, లేదా భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని మాత్రమే చెబుతూ వస్తున్నారు.
నిజానికి, గతంలో లోకేష్ మాట్లాడితే.. రెండు, మూడు లక్షలకుపైగానే ఉద్యోగాలు కల్పిస్తా అని హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఐటీతోపాటు, ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా భారీ ఎత్తున ఉద్యోగాలు అనేవారు. ఇప్పుడు కొత్త లక్ష్యం పెట్టుకుని వచ్చే ఏడాది నాటికి లక్ష అంటున్నారు. ఒక్క ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలంటే సాధ్యమా..? రాత్రికి రాత్రి కంపెనీలు వచ్చిపడిపోవు కదా..! అయినా, ఇలాంటి లక్ష్యాలను పెట్టుకున్నప్పుడు.. వాటిని చేరుకోవడం కోసం చేస్తున్న కృషిని కూడా లోకేష్ చెబుతూ ఉంటే బాగుంటుంది. మొత్తానికి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి, ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు! ఇంటికో ఉద్యోగం ఇస్తామని అప్పట్లో చంద్రబాబు వాగ్దానం చేశారు. దానిపై గతంలో లోకేష్ ఓ వివరణ ఇచ్చారు! ఇంటికో ఉద్యోగం అంటే ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగంలో వచ్చే ఉద్యోగాలు మాత్రమే కాదనీ, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా పొందే ఉపాధిని లెక్కించాలని కూడా చెప్పారు. ఇప్పుడు, వచ్చే ఏడాదికి లక్ష ఐటీ ఉద్యోగాలంటే… మరి, ఆ లెక్క ఎలా చెప్తారో చూడాలి.