హైదరాబాద్: వరంగల్ నగరంలో నిన్న కాంగ్రెస్ నేత రాజయ్య ఇంట్లో సజీవ దహనమైన సారిక, ఆమె కుమారుల కేసులో పోస్ట్ మార్టమ్ రిపోర్టే కీలకం కానుంది. వారి మృతదేహాలు నిన్నటినుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్నాయి. మృతదేహాలకు ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి వెళ్ళే నిపుణుల బృందం పోస్ట్ మార్టమ్ జరుపుతుంది. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారిది హత్యా, ఆత్మహత్యా అనే విషయంలో స్పష్టత రానుంది.
సారిక, ఆమె పిల్లలు చనిపోవటంపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. సారిక, ఆమె పిల్లలు కొంతకాలంనుంచి ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఇంట్లోనే నివసిస్తున్నారు. రాజయ్య, ఆయన భార్య హన్మకొండలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. మూడురోజుల క్రితమే వారు ప్రమాదం జరిగిన ఇంటికి వచ్చారు. రాజయ్యకు టికెట్ ఇవ్వొద్దంటూ సారిక ఢిల్లీ ఏఐసీసీసీకి పంపిన మెయిల్స్‌పై – ప్రమాదం జరిగిన రోజు రాత్రి, రాజయ్య భార్య, కుమారుడు అనిల్‌కు – సారికకు మధ్య గొడవ జరిగిందని అంటున్నారు. బయటనుంచి లేటుగా వచ్చిన రాజయ్య రాకతో గొడవ మరింత పెద్దదయిందట. ఇలా అయితే మరోసారి మీడియాముందుకెళతానని సారిక హెచ్చరించిందని అంటున్నారు. రాజయ్య అందరికీ సర్దిచెప్పి పంపాడని, అందరు ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి పడుకున్నారని, తీరా చూస్తే తెల్లవారుఝామున ప్రమాదం జరిగిందని ఒక కథనం వినిపిస్తోంది.
చనిపోయిన ముగ్గురూ బెడ్ మీద పడుకుని ఉన్నారని అంటున్నారు. అగ్నిప్రమాదం జరిగితే వారు అటూ, ఇటూ పరుగులు పెడతారు… గ్యాస్ కారణంగా పేలుడు కూడా సంభవిస్తుంది.. కానీ ఇక్కడ అలా జరగలేదు. అగ్నిప్రమాదానికి ముందే వారు చనిపోయి ఉంటారని, వారికి ముందే మత్తుమందుగానీ, విషంగానీ ఇచ్చి ఉంటారని… భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ బయటకు వస్తే కేసు సగం పరిష్కారమవుతుంది. మరోవైపు అనిల్ రెండో భార్య సనపైకూడా కేసు నమోదు చేశారు.