ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని సులువుగా వాడేస్తూంటారు. జగన్ భాషలో చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ కు కూడా ఓ విప్లవం కనిపిస్తోంది. పోలింగ్ విధుల్లో ఉండి ఓటేసే అవకాశం లేని వాళ్లు అత్యధిక మంది ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా … అటూ ఇటూ తిప్పినా ఓపికగా ఓటేశారు. ఇందు కోసం గంటల తరబడి నిలబడాల్సి వచ్చినా తగ్గలేదు.,
ఉద్యోగుల్లో ఓటు చైతన్యం పెరగడానికి.. 90 శాతానికిపైగా ఓటింగ్ జరిగేలా విప్లవం రావడానికి ఖచ్చితంగా జగనే కారణం అనుకోవచ్చు. వైసీపీ ఇచ్చే డబ్బులకు ఆశ పడి ఇలా పోస్టల్ బ్యాలెట్ల కోసం ఎగబడి దరఖాస్తు చేసుకున్నారని ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు కానీ… నిజమేంటో వారికీ తెలుసు. ఉద్యోగులు అంత పట్టుదలగా ఎవరికి ఓట్లేశారో తెలుసు. కేవలం డబ్బులిచ్చామని తమకు ఓట్లేస్తారని నమ్మకం పెట్టుకుంటున్నారు.
ఉద్యోగులు రాష్ట్ర భవిష్యత్ నే కాదు.. తమ భవిష్యత్ నూ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎక్కువ మంది ఓటు బాధ్యతను నిర్వర్తించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. గతంలో ఉద్యోగులు భారీగానే బ్యాలెట్లు ఉపయోగించుకునేవారు కానీ అప్పటి ట్రెండ్ తో పోలిస్తే.. ఇప్పటి ట్రెండ్ స్పష్టం.