హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాగురించి గుంటూరు నగరంలో పోస్టర్ వార్ జరుగుతోంది. ప్రత్యేకహోదా అనుకూల, వ్యతిరేక వర్గాలు తమ పేర్లు పేర్కొనకుండా ప్రత్యర్థులనుద్దేశించి పరుష పదజాలంతో పోస్టర్లు వెలువరించాయి. ఒకవర్గం పోస్టర్లలో, ‘ప్రత్యేక హోదాగురించి మాట్లాడితే డొక్క చీలుద్ది’, ‘ప్రత్యేకహోదా గురించి మాట్లాడినా, అడిగినా రంగుపడుద్ది’ అని ఉండగా, మరోవర్గం పోస్టర్లలో – ‘పిల్లలు కాల్చుకుని చనిపోతుంటే మీరు ఏసీగదులలో పడుకుంటారా’, ‘ప్రత్యేకహోదాపై కేబీసీ క్విజ్’ అని ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలను నగరానికి నడిబొడ్డున ఉన్న శంకరవిలాస్ సెంటర్, అరండల్ పేట, ఫ్లై ఓవర్లవద్ద కరెంటు స్తంభాలకు వేలాడదీశారు. ఈ పోస్టర్లు నగరంలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు సీపీఐ పార్టీ శ్రేణులు ఈ పోస్టర్లకు నిరసనగా ఆందోళన నిర్వహించాయి. ఈ పోస్టర్లు ఎవరు వేసినా తప్పేనని, ప్రభుత్వం వీటిని పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. కొంతసేపటి తర్వాత పోలీసులు వచ్చి ఈ ఫ్లెక్సీలను తొలగించారు.