గడువులు పెట్టుకోవడం గొప్ప కాదు గాని అమలు చేయడమే కష్టం. గడువులు పాటించిన వారిని హెచ్చరించడం సమస్య కాదు గాని వాటిని అందరికీ అనువర్తింపచేయడం న్యాయం. అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం విషయంలో ఈ రెండు ప్రాథమిక సూత్రాలనూ ప్రభుత్వం పాటించలేకపోతున్నది. ఇప్పటికి పదిసార్లకు పైగా వాయిదా పడిన తరలింపు ప్రహసనాన్ని మొన్న బుధవారం మరోసారి పక్కకు పెట్టింది. ఉద్యోగులు తరలిరాకపోతే వూరుకోమని ఉరుములు పిడుగులు కురిపించిన వారు సాక్షత్యూ సచివులు అంటే మంత్రులే రామని మొండికేస్తే గప్చిప్గా సర్దుకోవలసి వచ్చింది. కనీసం పది పదిహేనుమంది మంత్రులు ఆలోచనా రహితమైన అరకొర కార్యాలయాల్లోకి వెళ్లడానికి నిరాకరించడంతో ప్రభుత్వం నిరుత్తర స్థితిలో పడిపోయింది.స్థలం చాలక పోవడం సదుపాయాలు లేకపోవడం వంటి చాలా కారణాలు మంత్రులకు చిర్రెత్తించినట్టు కనిపిస్తుంది. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులూ, సిఎంకు దగ్గరైన మరో ఆరుగురు మంత్రులూ ఆఖరుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా లాంచనంగా సరిపెట్టారంటే పరిస్థితి అర్థమవుతుంది. నిర్మాణం చేస్తున్న షాపూర్జి పల్లోంజి కంపెనీ మంత్రులను శాంతపర్చి మార్పులు చేర్పులు చేస్తానని నచ్చజెప్పాల్సి వచ్చింది. గతంలో తరలించిన మూడు శాఖల వారు కూడా వినాయకచవితి వరకూ వాయిదా వేసుకున్నారు. హైదరాబాదు నుంచి వచ్చేసి మళ్లీ వెనక్కు మరలిన ఉద్యోగులు వచ్చి చూసి పెదవి విరిచేశారు. ప్రభుత్వ దృష్టి మొత్తం కృష్ణా పుష్కరాల హడావుడిలోవుండటంతో రాజధానిపై అసలే శ్రద్ద తగ్గింది. కార్పొరేట్ కార్యాలయాను మించిపోయేలా నిర్మించారని కొన్ని ఛానళ్లు పత్రికలు వూదరగొడుతుంటే మంత్రులకే మనసుకు రాని ఈ దురవస్థను ఎలా అర్థం చేసుకోవాలో మరి! దీనంతటికి మంత్రి నారాయణ కారణమని వారు విరుచుకుపడుతున్నారు గాని ఆయన ముఖ్యమంత్రి ప్రాపకంలో హాయిగానే వున్నారు. ఇంతకూ ఈ తాజా అంతరాయం తర్వాత పసందుగా పన్నెండవ ప్రవేశ ముహూర్తం ఎప్పుడు పెదతారో చూడ్డం తమాషాగా వుంటుంది.