తెలంగాణలో పోటీ పరీక్షల నిర్వహణ సర్కార్ కు కత్తిమీద సాముగా మారిపోయింది. చాలా పరీక్షలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ రాగా… కొన్నింటికి కొత్త ప్రభుత్వం రీనోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, పరీక్షలన్ని ఒకేసారి ఉంటే ఎలా అంటూ నిరుద్యోగ యువత రోడ్డెక్కటం ఇప్పుడు సర్కార్ కు ఇబ్బందిగా మారింది.
జులై 18వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలున్నాయి. దాదాపు 2.7లక్షల మంది ఈ పరీక్ష రాయబోతున్నారు. ఈ పరీక్షలు అయిన రెండ్రోజుల్లోనే గ్రూప్-2 పరీక్షలున్నాయి. దీంతో ఒకేసారి పరీక్షలు పెడితే ఎలా నిరుద్యోగ యువత ప్రశ్నిస్తోంది.
డిగ్రీ పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది గ్రూప్-2 రాస్తున్నారు. అందులో బీఈడీ, డీఎడ్ చదివిన వారు కూడా ఉండటంతో తాము డీఎస్పీకి ఎప్పుడు ప్రిపేర్ కావాలి, గ్రూప్-2కు ఎప్పుడు ప్రిపేర్ కావాలని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆన్ లైన్ స్లాట్స్ దృష్ట్యా… డీఎస్సీ వాయిదా సాధ్యం కాదని సర్కార్ ఇప్పటికే తేల్చి చెప్పింది. దీంతో కనీసం గ్రూప్-2 అయినా వాయిదా పడుతుందా అని యువత ఎదురుచూస్తున్నారు. ఎదో పరీక్ష వాయిదాకు అధికారులతో మాట్లాడుతాం అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాను టీజీఎస్పీ చైర్మన్ తో మాట్లాడాను అంటూ కోదండరాం కూడా ప్రకటించారు. కానీ ఇంతవరకు ప్రకటన అధికారికంగా రాలేదు.
అయితే, దీన్ని ఇంకా ఆలస్యం చేయకుండా ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలున్నాయి. గ్రూప్-2 ను కనీసం నెలన్నర వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త తేదీలపై స్పష్టత కోసం వేచి చూస్తుందని, ఆ క్లారిటీ రాగానే ప్రకటించబోతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.