ఓటీటీల కాలం ఇది. తెలుగు, తమిళం అనే బాషా బేధం లేదు. ప్రపంచ సినిమా మొత్తం అందుబాటులోకి వచ్చేసింది. అన్ని భాషల సినిమాల్నీ సబ్ టైటిల్స్ తో చూసేస్తున్నారు. మంచి సినిమా వస్తే భాషతో పనిలేదు. ఆ ఎమోషన్ ని అర్థం చేసేసుకుంటున్నారు. అందుకే `అసురన్ బాగుంది` అనగానే జనాలు చూసేశారు. ధనుష్ నటనకు కితాబులు ఇచ్చేశారు. `నారప్ప`గా అసురన్ వస్తుందంటే వాళ్లంతా ఆసక్తి చూపించారు. కచ్చితంగా మ్యాజిక్ రిపీట్ అవుతుందనుకున్నారు. కానీ.. `నారప్ప`లో ఆ స్థాయి కనిపించలేదు. అసురన్ ని చూసిన కళ్లని `నారప్ప` ఆనలేదు. పైగా… బోలెడన్ని విమర్శలు.
ఇప్పుడు అందరి దృష్టీ `కర్ణన్`పై పడింది. ఇది కూడా ధనుష్ సినిమానే. దీన్ని కూడా తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. ఈసారి ధనుష్ ప్లేస్ లో కనిపించేది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అని టాక్. `కర్ణన్` ఇంకా ఛాలెంజింగ్ సబ్జెక్ట్. `అసురన్`లో వెంకీ చేశాడు కాబట్టి, తన అనుభవాన్ని రంగరించాడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అయితే, ఈమాత్రం స్పందనైనా వచ్చేది కాదన్నది నిజం. ధనుష్ కి మ్యాచ్ చేయడం… వెంకీకే కష్టమైందంటే – బెల్లంకొండ ఏం చేస్తాడన్నది అందరి డౌటు. అందుకే `కర్ణన్ రీమేక్ చేయొద్దు బాబోయ్` అంటూ సోషల్ మీడియాలో… పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. బహుశా.. `నారప్ప`కి వచ్చిన రిజల్ట్ `కర్ణన్`కి వార్నింగ్ బెల్ కావొచ్చు. `కర్ణన్` రీమేక్ చేద్దామని భావిస్తున్న ఈ తరుణంలో నిర్మాతలు, దర్శకుడు, హీరో.. ఒక్కసారి ఆగి… ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని `నారప్ప` గుర్తు చేసింది. మరి… బెల్లం బాబు నిర్ణయం ఎలా ఉందో?