ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు, మరో వైపు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలపై విచారణ వేగంతో బీఆర్ఎస్ పెద్దలకు ఇబ్బందులు తప్పవని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ ఎల్. నర్సింహ రెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు, ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్ పాత్ర ఏంటో చెప్పాలంటూ తాజాగా నోటీసులు ఇచ్చారు.
ఈ నెల 15వ తేదీలోగా సమాధానం చెప్పాలని కేసీఆర్ ను జ్యుడిషియల్ కమిషన్ కోరగా…తనకు జులై 30 వరకు సమయం ఇవ్వాలంటూ కేసీఆర్ నుంచి రిప్లై వచ్చిందని కమిషన్ వెల్లడించింది. అయితే, విచారణకు సమయభావం రీత్యా ఖచ్చితంగా జూన్ 30వ తేదీ వరకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పటి లోపు కేసీఆర్ ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే వ్యక్తిగత విచారణకు హాజరు కోరుతూ నోటీసులు ఇస్తామని కమిషన్ తెలిపింది.
దీంతో కమిషన్ కోరినట్లుగా జూన్ 15లోగా కేసీఆర్ లిఖితపూర్వక సమాధానం ఇస్తారా..? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఆయన వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయనేది ఉత్కంఠ రేపుతున్నాయి. కేసీఆర్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్, అసెంబ్లీ సమావేశాల్లో వైట్ పేపర్ ను రిలీజ్ చేసింది. దీనిపై విచారణకు ఓ స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయగా… తాజాగా పవర్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై విచారణ దూకుడుగా కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ పెద్దలకు చిక్కులు తప్పవని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవర్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ కు కష్టకాలం మొదలైనట్లేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.